రేవంత్ రెడ్డి పీసీసీ ఛీప్ అయితే….
1 min readమాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపైన గత కొన్నాళ్ల నుంచి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన ఏ పార్టీలో చేరలేదు. కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు. తన తండ్రిపేరుతో నెలకొల్పిన స్వచ్చంధ సంస్థ వ్యవహారాలతో పాటు వ్యాపారాలు చూసుకుంటానని విశ్వేశ్వర్ రెడ్డి అప్పట్లో ప్రకటించారు. అయితే ఆయన మాత్రం రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక వేదికను తయారు చేయడానికి చర్చలు జరుపుతున్నారు.వివిధ పార్టీల నాయకులతో పాటు ప్రజా సంఘాలలతో ఆయన మాట్లాడుతున్నారు.ఇటీవల బర్తరఫ్ కు గురైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తో కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి చర్చలు జరిపారు. అయితే ఏదో ఒక పార్టీలో చేరతానని గతంలో ఆయన ప్రకటించారు. బీజేపీ నుంచి ఆఫర్స్ బాగా వస్తున్నాయని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. కోదండరాం తెలంగాణ జనసమితి లేదా ఇంకేదైనా పార్టీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. పీసీసీ నాయకత్వం మారిస్తే కాంగ్రెస్ లోకి కూడా తిరిగి వెళ్లే అవకాశముందని విశ్వేశ్వర్ రెడ్డి అప్పట్లో చెప్పారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేస్తే కాంగ్రెస్ లోకి వస్తానని ఆయన పలు ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ ను కాపాడగలరని చెప్పుకొచ్చారు. నేడో రోపో పీసీసీ ఛీప్ పైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్న సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట మార్చారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఛీప్ పదవి ఇచ్చినా తాను తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లనని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను కాపాడలేదని ఆయన అంటున్నారు. దేశంలో ఒకటి రెండు రాష్ట్రాల్లో మినహా కాంగ్రెస్ లేదని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. దీంతో మాజీ ఎం.పి తిరిగి కాంగ్రెస్ లోకి వస్తారన్న ఆ పార్టీ కార్యకర్తలు ఆశలు ఆడియాశలే అయ్యాయి.
టీఆర్ఎస్ కు ఈటెల రాజేందర్ గుడ్ బై చెప్పిన తర్వాత ఆయనతో కలిసి రాజకీయ వేదికను తయారు చేయడానికి విశ్వేశ్వర్ రెడ్డి సిద్ధమౌతున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా గట్టిగా గళం వినిస్తున్న వారిని ఈ వేదికపైకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీగా మార్చి బరిలోకి దిగాలన్నది ఆయన ఆలోచన .అందుకే రేవంత్ రెడ్డి పీసీసీ ఛీప్ అయినా కూడా కాంగ్రెస్ లో చేరనని బలంగా చెపుతున్నారు. మరి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అంచనాలు ఎంత వరకు ఆచరణలోకి వస్తాయో చూడాలి.