నోరు విప్పని పుట్టా మధు
1 min readతెలంగాణలో సంచలనం స్రుష్టిస్తున్న పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు వ్యవహారం మలుపులు తిరుగుతోంది. విచారణలో ఆయన నుంచి విషయాలు రాబట్టడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్యతో ఆయనకు సంబంధం ఉందన్న ఫిర్యాదుపైన విచారణ జరుగుతోంది. దాదాపు పది రోజుల పాటు అద్రుశ్యమైన పుట్టామధును భీమవరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఆయనకు షెల్టర్ ఇచ్చిన మద్దిపాటి శ్రీనివాస్ ను కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గట్టు వామనరావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన రెండో ఫిర్యాదు పైన విచారణ జరగుతుందన్న సమాచారంతోనే పుట్టా మంథని నుంచి తప్పించుకున్నారని సమాచారం. పలు ప్రాంతాలు తిరిగి చివరకు భీమవరంలో పోలీసుల చేతికి చిక్కారు. రామగుండం పోలీసులు రెండు రోజులుగా ఆయనను విచారిస్తున్నారు. అయితే ఎంక్వైయిరీలో పుట్టా మధు నోరు విప్పడం లేదని తెలుస్తోంది. గట్టు వామనరావు దంపతుల హత్యకు సంబంధించిన అనేక ప్రశ్నలకు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. హత్యతో తనకెలాంటి సంబంధం లేదని తేల్చి చెపుతున్నాడట. రాజకీయ కారణాలతోనే బిట్టు శ్రీను లాయర్ దంపతులను హత్య చేసి ఉంటాడని పుట్టా మధు స్పష్టం చేస్తున్నారని సమాచారం. గత పది రోజులుగా ఎక్కడున్నారన్న విషయాలు మాత్రం ఆయన పోలీసుల ముందు ఉంచారని తెలుస్తోంది. అయితే పుట్టా మధుకు న్యాయవాది గట్టు వామనరావు హత్యతో సంబంధం ఉందని పోలీసులు గట్టిగా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూాడా సేకరించిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. పుట్టా మధు నోరు విప్పకపోతే ఆధారాలను ఆయన ముందు పెట్టనున్నట్లు సమాచారం. గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనుకు భారీ ఎత్తున ఆర్థిక సాయం అందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆయన ఇంటి నిర్మాణానికి డబ్బులతో పాటు హత్యకు ఉపయోగించిన కారు కూడా పుట్టానే అందించారనే అనుమానాలున్నాయి. ఇందు కోసం రెండు కోట్ల రూపాయలను పుట్టా మధు సిద్ధం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. కోటి రూపాయలు పుట్టా మధు బ్యాంక్ నుంచి డ్రా చేయగా మరో కోటీ రూపాయలను మరో స్నేహితుడు సమకూర్చాడని తెలుస్తోంది. ఈ లెక్కలు కూడా పోలీసులు పుట్టా మధు ముందు ఉంచారని చెపుతున్నారు. పుట్టాతో పాటు ఆయన తమ్ముడు పుట్టా సతీష్ , స్నేహితుడు మద్దిపాటి శ్రీనివాస్ ను కూడా పోలీసులు వేరువేరుగా విచారిస్తున్నారు. ఇప్పటి వరకు పుట్టా మధు నోరు విప్పికపోవడంతో పోలీసులు మరిన్ని కోణాల్లో విచారించడానికి ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల పాటు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆయన అరెస్టు చూపించే అవకాశాలున్నాయి.