ఈటెలకు పెరుగుతున్న మద్దతు
1 min readమంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్ భవిష్యత్త్ కార్యాచరణకు సిద్ధమౌతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలగాలని భావిస్తున్న ఆయన అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవమానకరంగా మంత్రి పదవి నుంచి గెంటేయడంతో తీవ్ర ఆవేదనతో ఉన్న ఈటెల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఛాలెంజ్ విసరాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేతంలోకి వెళ్లాలని రాజేందర్ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే తన నియోజకవర్గం హుజూరాబాద్ నాయకుల అభిప్రాయాలను ఆయన సేకరించారు. మరికొందరు సన్నిహితులు, ప్రజా సంఘాల నేతలు, రాజకీయ సన్నిహితులతో చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అయితే ఇప్పటికిప్పుడు హడావుడిగా కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం లేకపోవడంతో ఈటెల ఆచితూచి వ్యవహారిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బహిష్కరించేంత వరకు వేచి చూసే ఆలోచన కూడా ఉంది. మరో వైపు ఈటెల రాజేందర్ కు మద్దతు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీసీ సంఘాలు ఆయనను కలిసి అండగా ఉంటామని చెపుతున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ వైఖరీతో విసిగిపోయిన నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చే సూచనలున్నాయి. తాజాగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఈటెల రాజేందర్ ను కలిశారు. టీఆర్ఎస్ పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహారిస్తున్న రవీందర్ రెడ్డి అకస్మాత్తుగా ఈటెల ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. ఏనుగు రవీందర్ రెడ్డి హరీష్ రావుకు సన్నిహితుడు. ఎల్లారెడ్డి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సురేందర్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సురేందర్ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో రవీందర్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోయింది. నియోజకవర్గ పార్టీ బాధ్యతలన్ని ఎమ్మెల్యే సురేందర్ కు అప్పగించడంతో ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. టీఆర్ఎస్ ప్రారంభం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. మూడు సార్లు ఆ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఓడిపోవడంతో రవీందర్ రెడ్డి పరిస్థితి తారుమారైంది. పార్టీ వైఖరీపైన తీవ్ర అసంత్రుప్తిగా ఉన్న ఆయన ఇప్పుడు ఈటెలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
మరో వైపు ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ ఎం.పి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఈటెల రాజేందర్ ను కలిశారు. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ వేదికను తయారు చేయడానికి కొండా కొంత కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు రాజకీయ, ప్రజా సంఘాల నేతలతో ఆయన మాట్లాడారు. ఈటెల రాజేందర్ తో గత కొంత కాలం నుంచే విశ్వేశ్వర్ రెడ్డి టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఈటెల టీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి సిద్ధమైన నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది. ఈటెల, కొండా కాంబినేషన్ లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా ఈటెల ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. ఈటెల రాజేందర్ సతీమణి జమునారెడ్డి తనకు బంధువని ,అందుకే కలిశానని, రాజకీయాలు మాట్లాడలేదని కొండా చెపుతున్నారు. అయితే త్వరలోనే వీరిద్దరు రాజకీయ ప్రకటన చేసే అవకాశముంది. ఈటెల రాజకీయ నిర్ణయం ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ లోని అసంత్రుప్త నేతలతో పాటు ఇతర రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు ఆయనతో చేతులు కలిపే సూచనలున్నాయి.