పెళ్లికి రావొద్దంటు ఆహ్వానం పంపిన మాజీ ఎమ్మెల్యే
1 min read
సాధారణంగా మన ఇళ్లలో పెళ్లి జరిగితే బంధువులు, సన్నిహితులందరిని పిలవడం ఆనవాయితీ. అందులోనూ రాజకీయ నాయకుల ఇళ్లలో పెళ్లి జరిగితే ఆహ్వానితులు వేలల్లో ఉంటారు. ఆ ప్రాంతంలోని ప్రజలందరికి పెళ్లి పిలుపు ఉంటుంది. వందలాది మంది విఐపిలు, వేలాది మంది జనంతో పొలిటికల్ లీడర్ల ఇళ్లలో వివాహలు కళకళలాడతాయి. అయితే కరోనా దెబ్బకు శుభకార్యాల తీరు మారిపోతోంది.నిరుపేదల నుంచి ఆగర్భ శ్రీమంతుల వరకు పెళ్లిళ్లు చాలా సింపుల్ గా కానిచ్చేస్తున్నారు.తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూతురు పెళ్లి ఖరారైంది. మంచి మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాకర్ కు రాష్ట్రమంతా అభిమానులున్నారు. పిలిచినా ,పిలవకపోయినా వేలాది మంది పెళ్లికి రావడం ఖాయం. అయితే కరోనా కారణంగా తన కూతురి పెళ్లి చాలా సింపుల్ గా చేయాలని ఆయన భావించారు. అందుకే ఆహ్వాన పత్రికనే కొంత వెరైటీగా రూపొందించారు. సాధారణంగా పెళ్లికి రావాలంటు వెడ్డింగ్ కార్డు అందిస్తాం. కాని చింతమనేని మాత్రం పెళ్లికి రావద్దంటు ఆహ్వాన పత్రికను పంపించారు. జనవరి మూడున జరిగే తన కూతురు పెళ్లికి ఎవరూ రావొద్దని కోరుతు శుభలేఖలు అందించారు. మీ అందరిని ఆహ్వానించి నూతన దంపతులను ఆశ్వీరాదించాలని కోరడానికి కరోనా నిబంధనలు అటంకంగా ఉన్నవిషయం తెలిసిందే..కావున పరిస్థితులను గమనించి సహ్రుదయంతో మీ ఇళ్ల నుంచే శుభాశీస్సులు అందించాలని కోరుతున్నాం…అని శుభలేఖలో పేర్కొన్నారు. పెళ్లిని ప్రత్యక్షంగా చూడటం కోసం యూట్యూబ్ ,ఫేస్ బుక్,ట్విట్టర్ ఎకౌంట్లను వెడ్డింగ్ కార్డులో పొందుపర్చారు. తమ అభిమాన నాయకుడి కూతురి పెళ్లికి ఆహ్వానం అందిందని సంబరపడ్డ కార్యకర్తలు లోపల మ్యాటర్ చూసి నోళ్లు వెళ్లబెడుతున్నారు.