షర్మిల కొత్త పార్టీ
1 min readఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ సోదరి షర్మిల తెలుగు రాష్ట్రాల్లో మరో సారి చర్చనీయాంశమయ్యారు. ఇంత కాలం జగన్ కు తోడుగా నిలబడ్డ ఆమె సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి సిద్దమయ్యారు. సరికొత్త పార్టీతో సొంత అన్నకు షాక్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడానికి షర్మిల చర్చలు మొదలుపెట్టారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వైఎస్ అభిమానులతో లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. రాజకీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాలపైన ఆమె మాట్లాడనున్నారు. జగన్ తో ఏర్పడిన విభేదాల కారణంగానే షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలుస్తోంది. తనకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో పాటు తమ కుటుంబాన్ని దూరం పెడుతున్నారన్న కారణంతోనే ఆమె వేరు కుంపటి పెడుతున్నట్లు సమాచారం. షర్మిల భర్త అనిల్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ కు విస్తరించే సూచనలున్నాయి. లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్లైక్సీలో జగన్ ఫోటో ఎక్కడా కనిపించలేదు.
మరో వైపు జగన్, షర్మిల ఆడుతున్న డ్రామాలో భాగమే కొత్త పార్టీ అనే విమర్శలు కూడా వస్తున్నాయి. జగన్ పైన అసంత్రుప్తి ఉంటే ఎపీలో పార్టీ ఏర్పాటు చేయాలని, ఆలా కాకుండా తెలంగాణలో ఎలా పెడతారనే ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణలో వై.ఎస్ అభిమానులు ఎక్కువగా ఉన్నారని, వారి మద్దతుతో ఇక్కడ పార్టీ పెట్టి అధికారంలోకి రావాలని ప్రయత్నాస్తున్నారనే చర్చ జరుగుతోంది.