కలిసి పనిచేస్తే కుట్రలను ఎలా ఛేదించాలో చూపించాం: భట్టి విక్రమార్క

హైదరాబాద్: కలిసి పనిచేస్తే ఎలాంటి కుట్రలనైనా ఎలా ఛేదించవచ్చో చేసి చూపించామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకుల తీరు, వారి భాష, శుద్ధీకరణ ఘటనపై కాంగ్రెస్ సభ్యులంతా గట్టిగా స్పందించి కట్టడి చేయగలిగామని పేర్కొన్నారు.
మనమంతా ఒకే మాట.. ఒకే బాటగా ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేయలేదని అన్నారు.
ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సరైన స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం వల్లే ప్రతిపక్షాలకు ప్రచారం చేసుకునే అవకాశం లభిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రచారం చేస్తే ఆ ప్రవాహంలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయని అన్నారు.
సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
సంక్షేమం, విద్య, వైద్య రంగాల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని భట్టి విక్రమార్క సూచించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 27 లక్షల మంది విద్యార్థులకు హైజెనిక్ బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నామని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
కులసర్వేను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపాం
చిన్న పొరపాటు కూడా లేకుండా కులసర్వే నిర్వహించామని భట్టి విక్రమార్క తెలిపారు. కులసర్వేను అసెంబ్లీలో ఆమోదించుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు.
ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా అమలు చేయబోతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఉద్యోగులకు కోటి రూపాయల బీమా అందిస్తున్నామని తెలిపారు.
మనం చేసిన పనులే మనల్ని గెలిపిస్తాయి
ప్రభుత్వం చేసిన పనులే కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపిస్తాయని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలో ఇంటింటికీ ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై లబ్ధిదారులు చాలా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ప్రచార కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
