కొండా సురేఖ OSD సుమంత్‌కు ముందస్తు బెయిల్

షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ OSD సుమంత్‌కు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.
సుమంత్ రూ.25 వేల చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు (ష్యూరిటీలు) సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ష్యూరిటీలు సమర్పించిన అనంతరం ముందస్తు బెయిల్‌పై విడుదల చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది.
దర్యాప్తుకు సహకరించాలి
కేసు దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి అవసరమైనప్పుడు పిలిచినప్పుడు ఆయన ముందు హాజరు కావాలని ఆదేశించింది.
అలాగే కేసులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సాక్షినీ ప్రేరేపించడం, బెదిరించడం లేదా ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని కోర్టు షరతు విధించింది.
దేశం విడిచి వెళ్లకూడదు
కోర్టు ముందస్తు అనుమతి లేకుండా భారతదేశం విడిచి వెళ్లకూడదని సుమంత్‌కు ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా పిటిషనర్లు తమ మొబైల్ ఫోన్ నంబర్లు, నివాస చిరునామాలను దర్యాప్తు అధికారికి అందించాలని కోర్టు స్పష్టం చేసింది.
కోర్టు విధించిన అన్ని షరతులను పాటిస్తూ దర్యాప్తుకు సహకరించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
