కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ రెడ్డి
విమానాశ్రయాల పనులు వేగవంతం చేయండి…
* రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయండి
* హెలీ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టండి
* ఆదిలాబాద్ విమానాశ్రయంలో ఎంఆర్వో వసతులు కల్పించండి
* కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఢిల్లీ: తెలంగాణలో ఆదిలాబాద్, మామూనురు (వరంగల్) విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మామూనురు విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణను పూర్తి చేసి ఇచ్చామని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్) వసతులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్‌లో రన్ వే ఫైనలైజ్‌కు సంబంధించి రక్షణ, పౌర విమానయన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. మామునూరు ఎయిర్పోర్ట్ టెండర్లను రెండు వారాల్లో పిలిచి డిసెంబరు నాటికి ఖరారు చేసి పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేశారు.
తెలంగాణలో ఛాపర్ల ద్వారా హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హెలీ టూరిజంతో తెలంగాణలో పర్యాటక రంగం మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని సీఎం తెలియజేశారు. హుస్సేన్ సాగర్ లో సీ ప్లేన్ ల్యాండింగ్‌కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేశారు. సమావేశంలో ఎంపీలు సురేశ్ షెట్కార్, ఎం.అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కార వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
