మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయాల్సిందే…ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయాల్సిందే…
* బకాయిల వసూలుకు విధివిధానాల రూపకల్పన
* ధాన్యం నిల్వకు అయిదు నియోజకవర్గాల్లో సైలో బ్యాగ్ నిర్మాణాలు
* పౌరసరఫరాల సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్: మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపే వారితో సానుకూలంగా ఉంటామని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని సీఎం హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో బుధవారం సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం రూ.వేల కోట్ల బకాయిలకు అవకాశం ఇచ్చి.. తిరిగి ఆ తప్పిదాన్ని తమ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే బకాయిల వసూలులో కొంత పురోగతి ఉందని, అయితే ప్రతి ధాన్యం గింజకు చెందిన బకాయిని వసూలు చేయాల్సిందేనన్నారు. బకాయిల వసూలుకు సంబంధించి విధివిధానాల రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విధివిధానాల రూపకల్పన పూర్తయిన తర్వాత ఆ నివేదికను మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించాలని సీఎం సూచించారు. మంత్రివర్గ ఉప సంఘం పరిశీలన అనంతరం ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొండి బకాయిదారులుగా మారిన మిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని మహిళా సంఘాలకు కేటాయించి మిల్లింగ్ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రతి సీజన్‌లో ధాన్యం నిల్వకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే తగు కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ధాన్యం భారీగా వచ్చే
నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద సైలో బ్యాగ్ నిర్మాణాలను పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్వయం సహాయ సంఘాల (SHG) ఆధ్వర్యంలో సైలో బ్యాగ్ నిర్మాణాలకు నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయిస్తామని సీఎం తెలియజేశారు. వీటి నిర్మాణానికి సంబంధించి రెవెన్యూ, పౌరసరఫరాలు, మహిళా సంక్షేమ శాఖల మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వీబీ జీ రామ్ జీ లో ఫ్లాట్‌పాంల నిర్మాణానికి అవకాశం ఉన్నందున, విశాలమైన ఫ్లాట్‌పాంలు నిర్మించి జర్మన్ టెంట్లతో ధాన్యం నిల్వకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. మండల, గ్రామ స్థాయిలో ఉన్న ప్రైవేటు గోదాములు, ధాన్యం నిల్వకు ఉపయోపపడే కల్యాణ మండపాలు, పాత థియేటర్లు, ఇతర షెడ్లను ముందుగానే గుర్తించి ధాన్యం నిల్వకు లీజుకు తీసుకోవాలని సీఎం సూచించారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రైస్‌మిల్లర్ల అసోసియేషన్ నాయకులు తూడి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
