ప్రతి కుటుంబానికి ఉచితంగా జీవిత బీమా

తెలంగాణ బడ్జెట్ లో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యమిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ఆర్ధిక వృద్ధి ని దృష్టి లో పెట్టుకొని మౌలిక వసతుల కల్పనకు సరిపడే నిధుల కేటాయింపు జరిగిందన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యానికి బడ్జెట్ పెద్ద పీట వేసిందని సీఎం వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బడ్జెట్ లో అన్ని రంగాలు, అన్ని వర్గాలకు నిధులు కేటాయించామన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం ప్రవేశ పెట్టామని సీఎం వివరించారు.
ఈ పధకం ద్వారా రూ. 5 లక్షల బీమా పరిహారం అందిస్తున్నాం. రాష్ట్రంలోని దాదాపు 1కోటి 15లక్షల కుటుంబానికి ఈ పథకం వర్తించనుందని తెలిపారు. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలకు, ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక నిధులు కేటాయించామన్నారు.జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా మార్పులు తీసుకువస్తామని సీఎం వివరించారు. ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ టూ వరకు విద్యార్థులు ఒకే చోట ప్రభుత్వ స్కూల్లో చదివే విధానాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.అప్పులు, ఆదాయానికి సంబంధించి పారదర్శకంగా అన్ని వివరాలు వెల్లడించామన్నారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా ప్రభుత్వం చేసిన అప్పు రూ.3.47లక్షల కోట్లన్న ఆయన ఇందులో నుంచి గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకే 3.30 లక్షల కోట్లు చెల్లించామని రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వివిధ విభాగాల్లో ఉన్న లీకేజీలను అరికడుతున్నామని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుంటున్నామని ముఖ్యమంత్రి అన్నారు.

