మూసీ ప్రాజెక్టు పైన సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

సీఎం రేవంత్ రెడ్డి నడుం బిగించారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పైన జరుగుతున్న దుష్పచారాన్ని ఒంటిచేతితో తిప్పికొట్టారు. మూసీ ప్రక్షాళన అవసరాన్ని మరో సారి గట్టిగా నొక్కి వక్కానించారు. మూసీ తో హైదరాబాద్ కు ఉన్న అనుబంధాన్ని, గాంధీ సరోవర్ ప్రాజెక్టు ముఖ్యఉద్దేశాన్ని విశదీకరించారు. మూసీ ప్రాజెక్టు పైన ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానం ఇచ్చారు. సామాన్యుల్లో నెలకొన్న అనుమానాలకు తెర దించారు. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులు అయ్యేవారికి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుందో వివరించారు. వారిలో ఒక భరోసా కల్పించారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. మూసీ ప్రాజెక్టుతో ఏం చేయబోతున్నాం, భవిష్యత్తు హైదరాబాద్ ఎలా ఉంటుందన్న విషయాలను అధికారులు కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు గురించి స్వయంగా వివరణ ఇచ్చారు. గత కొంత కాలంగా ఈ ప్రాజెక్టు పైన నెలకొన్న అనుమానాలు, అపోహాలకు ఆయన తెర దించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా నిర్వాసితుల విషయంలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. మూసీ లో ఆక్రమించుకుని నివాసం ఉంటున్న వారితో పాటు బఫర్ జోన్ ఉన్న కట్టడాల విషయంలో విమర్శలు వస్తున్నాయి. అయితే నిర్వాసితులకు ఏ మాత్రం అన్యాయం జరగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. బాధితుల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉంటుందని, వారికి కావాల్సిన సాయం అందిస్తామన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కూడా నిర్వాసితులకు అందించే ప్యాకేజీ పైన సలహాలు, సూచనలు చేయాలన్నారు. వాటిని స్వీకరించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వారి పైన కూడా ఆయన ధ్వజమెత్తారు. తాను ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే పేరు వస్తుందన్న భయంతోనే కొందరు విష ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా ముఖ్యమంత్రి మాత్రం నిర్వాసితుల విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడారు.వాళ్లలో నమ్మకం కల్గించడానికి ఆయన ఈ వేదికను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. వారికి అండగా ఉంటామన్న భరోసాను మరోసారి ఇచ్చారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా ప్రాజెక్టు ఆగదన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పూర్తి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన విజయం సాధించినట్లే.

