స్పీకర్ ముందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రెండు వారాల్లో అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ పైన రేపు వాదనలు విననున్నారు. విచారణకు హాజరుకావాలని కడియం శ్రీహరిని స్పీకర్ ఆదేశించారు. కడియం శ్రీహరి పైన ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విచారణ ప్రక్రియలో పాల్గొంటారు.
ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పైన స్పీకర్ వాదనలు విన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి టీం తమ వాదనలు వినిపించారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంతో దానం నాగేందర్ పైన స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
