సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతం

‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది.
గత నెలలో హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది.
మూడు రోజుల వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులోనూ తెలంగాణ ఆశించిన లక్ష్యాన్ని సాధించింది.
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 2026 సదస్సులో పెట్టుబడులకు మించి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరింది.
మూడు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో ప్రతినిధుల బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది.
ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు (MoUలు) కుదుర్చుకుంది.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలక సెషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగం, హైదరాబాద్ లో వరల్డ్ ఎకనమిక్ ఫాలో అప్ ఫోరమ్ నిర్వహించాలనే ప్రతిపాదన కు సానుకూల స్పందన లభించింది.
మూడు రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
పలు కీలక సమావేశాలు, ప్రత్యేక సెషన్ల అనంతరం మూడు రోజుల తెలంగాణ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన గురువారం సాయంత్రం ముగిసింది.
దావోస్ లో కార్యక్రమాలు ముంగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూరిచ్ బయల్దేరారు. అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళుతున్నారు. మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి దావోస్ నుంచి ఇండియా కు తిరుగు పయనమయ్యారు.
