రేవంత్ రెడ్డి చాణక్యం..కేసీఆర్ ఖేల్ ఖతం

అపర రాజకీయ చాణక్యుడు. రాజకీయదురంధరుడు. ఆయన దెబ్బ కొడితే రాజకీయ పార్టీలు అన్ని గిలిగిలా తన్నుకోవాల్సిందే. ఆయన రాజకీయ చాతుర్యం ముందు ఎంతటి దిగ్గజమైనా దిగదుడుపే.. ఇది కేసీఆర్ గురించి యేళ్లు గా చెపుతున్న మాట. కాని అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత పార్లమెంటు ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి దెబ్బ కు కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయింది. ఫామ్ హౌస్ లో మౌనంగా కూర్చుని కుమిలిపోవాల్సిన స్థితి నెలకొన్నది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి కేసీఆర్ గత కొన్నాళ్లుగా అనేక వ్యూహాలు రచిస్తున్నారు. కేటీఆర్ ను ముందు పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా అవకాశం అంది రాకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో కేసీఆర్ తన రాజకీయ చాణక్యానికి మరో సారి పదును పెట్టి సీఎం రేవంత్ రెడ్డి పైన కత్తి దూయడానికి ప్రయత్నం చేశారు. కాని ఆ కత్తి కి పదును లేదని, మొండిబారిపోయి మూలపడిందని తేలిపోయింది. ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దింపడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉపయోగపడుతుందనే దింపుడు కళ్లెం ఆశలో ఉన్న కల్వకుంట్ల కుటుంబానికి రేవంత్ రెడ్డి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని అన్ని అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని తేలిపోయింది. 14 వ తేదీన ఫలితం లాంఛనమేనని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని చాలా సర్వే సంస్థలు ముందస్తు అంచనాలను విడుదల చేశాయి. బీఆర్ఎస్ పార్టీ కి భారీ మెజారిటీ ఖాయమని కేకే లాంటి సర్వే సంస్థలు ప్రకటించాయి. కాని పోలింగ్ ముగిసే నాటికి అంచనాలు అన్నీ తారుమారు అయ్యాయి. అవే సర్వే ఏజెన్సీలు ఇప్పుడు కాంగ్రెస్ విజయం ఖాయమని తేల్చాయి.
నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వెనకంజలో లేదు.ఆ పార్టీ అభ్యర్థి గా నవీన్ యాదవ్ ను ప్రకటించిన తర్వాత నుంచి మరింత ఊపు వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉండటం, ఉప ఎన్నిక ఖాయమని తేలాక జూబ్లీహిల్స్ లో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేయడం, సంక్షేమ కార్యక్రమాలు అమలు తో కాంగ్రెస్ దే పై చేయి గా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ప్రభావం ఇక్కడ చాలా ఎక్కువగా కనిపించింది. కొత్త రేషన్ కార్డుల మంజూరు, సన్న బియ్యం పంపిణీ , రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ , ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి స్కీంలతో జూబ్లీహిల్స్ జనం సంతృప్తి గా ఉన్నారు. దీంతో పాటు అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతుందనే భావన ఎక్కువ మందిలో కనిపించింది.
అయితే బీఆర్ఎస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పోటీ తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయం వినిపించింది. దీనికి తోడు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం , సర్వే సంస్థలతో తమకు అనుకూలంగా ఫలితం వస్తుందని చెప్పించడంతో కొంత గందగోళం కనిపించింది. అయితే ఇదంతా పాలపొంగేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో తేలిపోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దని భావించిన ఆయన తన టీం ను అంతా మోహరించారు. స్వయంగా ఆయన నాలుగు చోట్ల రోడ్ షోలు నిర్వహించారు. డివిజన్ కు ఇద్దరు చొప్పున మంత్రులకు బాధ్యత అప్పగించారు. ఎమ్మెల్యేలను వాళ్లకు సాయం గా మోహరించారు. అనేక మంది పార్టీ నాయకులు కూడా రంగంలోకి దూకారు. వారం రోజుల్లో జూబ్లీహిల్స్ అంతా కాంగ్రెస్ మయంగా మారింది. పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ తన సత్తా చూపించింది. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా మోహరిస్తుందో మరో సారి జూబ్లీహిల్స్ లో నిరూపితమైంది. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ చాణిక్యం ప్రదర్శించారు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తన సేనలను మోహరించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా, సర్వే ల వ్యూహాన్ని పటాపంచలు చేశారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. దీంతో ఉప ఎన్నిక ఆ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి మంత్రాంగం నడిపారు. కేటీఆర్, హరీష్ రావు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేశారు. వందలాది మంది నాయకులను మోహరింపజేశారు. సానుభూతి అస్త్రంతో రంగంలోకి దిగారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన కు వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం చేశారు. హైడ్రా ను భూతంగా చూపించే ప్రయత్నం చేశారు. కాని సీఎం రేవంత్ రెడ్డి చాణిక్యం ముందు కేటీఆర్ టీం నిలబడలేకపోయింది. తమ మీడియాతో హైప్ క్రియేట్ చేయడానికి కేటీఆర్ చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా దెబ్బకొట్టింది.
జూబ్లీహిల్స్ విజయంతో కాంగ్రెస్ పార్టీ పైన సీఎం రేవంత్ రెడ్డి పట్టు మరింత పెరగడం ఖాయం. ఈ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ ను ఓడిస్తే రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేయవచ్చునని కేటీఆర్ టీం అంచనా వేసింది. సీఎం ని వీక్ చేయడానికి తమకు అందివచ్చిన అతిపెద్ద అస్త్రంగా వారు భావించారు. కాని రేవంత్ రెడ్డి వారి అంచనాలను తలకిందులు చేశారు. ఇప్పటికే కవిత దెబ్బకు అల్లాడిపోతున్న కేసీఆర్ టీం కి రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ తో అల్లాడిపోవడం ఖాయం.
