వీరమరణం చెందిన పోలీస్ కుటుంబానికి కోటీ రూపాయల పరిహారం

దొంగ దాడిలో వీరమరణం పొందిన నిజామాబాద్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోటి రూపాయల పరిహారంతో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇస్తామని ఆయన ప్రకటించారు. ప్రమోద్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆయన తెలిపారు. వీటితో పాటు పోలీస్ భద్రత సంక్షేమం నుంచి 16 లక్షల రూపాయలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి మరో 8 లక్షల రూపాయల సాయం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీస్ కుటుంబాలకు గాజుల రామారంలో 200 గజాల ఇంటి స్థలం కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణదినోత్సవం సందర్భాంగా పోలీస్ అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.
