సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

సింగరేణి లాభాల్లో 34 శాతం కార్మికులకు దసరా బోనస్ గా ఇస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 819 కోట్ల రూపాయలను బోనస్ రూపంలో కార్మికుల ఖాతాల్లో వేస్తామని ఆయన తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా 5,500 రూపాయలను బోనస్ గా అందిస్తామని సీఎం వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరవలేమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను మా పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తూనే ఉంటుందన్నారు. సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్ లో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్న ఆయన ఆ దిశగా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు.