జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్..?

త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో బై ఎలక్షన్ జరగబోతుంది. సిట్టింగ్ సీటు ను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం జూబ్లీహిల్స్ జనం అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. దీంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ దక్కించుకోవడం కోసం ఆశావాహులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ ను ఎమ్మెల్సీ గా పంపించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రి వర్గం గవర్నర్ కు సిఫారసు చేసింది. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ తనకు ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం స్థానిక నేత నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో పనిచేసుకోవాలని ఇప్పటికే నవీన్ యాదవ్ కి సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరో వైపు బీఆర్ఎస్ తన అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత నే తమ అభ్యర్థిగా నిలబెట్టబోతుంది.గోపీనాథ్ మరణం వల్ల వచ్చిన సానుభూతి తమకు ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే సర్వే సంస్థల అంచనా ప్రకారం జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు అవకాశాలు ఏ మాత్రం లేవని తెలుస్తోంది.