మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అనర్హత ఫిర్యాదులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు సూచించింది. అనర్హత పిటిషన్ల మీద నిర్ణయం తీసుకోకుండా ఏళ్ల తరబడి ఉంచడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్ లో చట్టం చేస్తే బాగుంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.
బీఆర్ఎస్ తరుపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొంత కాలంగా విచారణ జరుగుతోంది. తుది తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గురువారం వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు పైన పార్టీలు స్పందించాయి. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అధికార కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ కు ఇది చెంపపెట్టు అని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పైన స్పీకర్ దే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లు ఆ పార్టీ నేతలు అన్నారు.