తెలంగాణ ప్రభుత్వ పాఠశాల్లో అత్యాధునిక సాంకేతిక విద్య

1 min read

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ప్రముఖ NGO సంస్థలతో రాష్ట్ర విద్యా శాఖ  MOU కుదుర్చుకున్నది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకున్నారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్​ టెక్​ సదుపాయాలను   ప్రభుత్వం అందించనున్నది. నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్​ పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్​దార్​ నిర్వహిస్తున్న పైజామ్ పౌండేషన్, సఫీనా హుస్సేన్​ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో ప్రభుత్వం  MOU కుదుర్చుకున్నది.దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో విద్యా నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం  ప్రభుత్వం తీసుకుంది.

నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్ కృత్రిమ మేథ ఆధారిత ప్లాట్‌ ఫారమ్‌తో 540 పాఠశాలలలో పని చేస్తుంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో 5,000కి పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్​ భాషలతో పాటు మ్యాథ్స్​ బేసిక్స్​ను ఈ సంస్థ అందిస్తుంది. ఫిజిక్స్ వాలా ఇంటర్​ విద్యార్థులకు నీట్​, జేఈఈ, క్లాట్​ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తుంది.ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) శిక్షణను అందజేస్తుంది.డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలో ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్​ 12 వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది.పై జామ్ ఫౌండేషన్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్ మరియు కంప్యూటేషనల్ థింకింగ్ పై శిక్షణను అందిస్తుంది.ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు , బాలికల అక్షరాస్యత మరియు విద్యా అవకాశాలను మెరుగుపరుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.