మరో సారి కులగణన
1 min read
రాష్ట్రంలో ఓబీసీలకు విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దశాబ్దాల బీసీల కలను నిజం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో ఓ బీసీల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేస్తాం అన్నారు.
శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన బిల్లును.. పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి ఆమోదం పొందడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తాము దేశంలోని అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెస్తాం అన్నారు.పార్లమెంట్లో బిల్లు ఆమోదం కోసం కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళుతుందని తెలిపారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కూడా కడతాం అన్నారు.ఇంటింటి సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారికోసం మరో అవకాశం ఇస్తామన్నారు. రాష్ట్రంలో మూడు శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు వారికి మరోసారి అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. కెసిఆర్ కేటీఆర్ పల్లా వంటి వారు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వలేదు, మరి కొందరు అందుబాటులో లేకుండా పోయారు వారందరి కోసం మరోసారి అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు.
ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సమగ్ర ఇంటింటి సర్వేలో వివరాల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని తెలిపారు.
టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని కోరితే అధికారులు ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి అన్ని వివరాలు నమోదు చేసుకుంటారని తెలిపారు.మండల కార్యాలయాల్లో ప్రజా పాలన అధికారులు ఈ పది రోజులు అందుబాటులో ఉంటారు. అక్కడ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.ఆన్ లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనేది అందరి కోరిక బలమైన లక్ష్యం సహకరించిన వారందరికీ ధన్యవాదాలు అన్నారు.
రాష్ట్రంలో కుల గణన విజయవంతం అయితే దేశమంతటా చేయాల్సి వస్తుందని అనుకునేవారు రీ సర్వే కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్ష మందికి పైగా సిబ్బందితో పూర్తిగా శాస్త్రీయంగా సమగ్ర ఇంటింటి సర్వే రాష్ట్రంలో జరిగిందని అన్నారు.రాష్ట్రంలో ఏ ఏ వర్గాల జనాభా ఎంతో శాసనసభలో లెక్కలతో సహా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు, చర్చ కూడా జరిగిందని తెలిపారు.ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు ఆమోదం కోసం, మద్దతు కూడబెట్టడానికి రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి.. రాజకీయ పార్టీలు, సోషల్ యాక్టివిస్టులు, మేధావులు, ప్రజలు అంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు 56 శాతంగా ఉన్నట్టు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.