‘ఇందిరమ్మ’ ఇండ్లపైన బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
1 min read
‘ఇందిరమ్మ’ పేరు పెడితే ఇండ్లు ఇచ్చే ప్రసక్తే లేదు
మోదీ ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లకు ఇందిరమ్మ పేరెట్లా పెడతారు?
కొత్త రేషన్ కార్డులపై సీఎంతోపాటు ప్రధాని ఫోటో కూడా ఉండాల్సిందే
కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తుంటే…పీఎం ఫోటో ఎందుకు పెట్డడం లేదు?
రేషన్ కార్డుపై ప్రధాని ఫోటో పెట్టకపోతే… రాష్ట్రానికి ఉచిత బియ్యం ఎందుకివ్వాలి?
లేనిపక్షంలో నేరుగా పేదలందరికీ కేంద్రమే ఉచితంగా బియ్యం, ఇండ్లు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తాం…
గత పదేళ్లలో దావోస్ పెట్టబడులపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా?
ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు అందగానే కేసును అటకెక్కించారా?
అవినీతిలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది
రేవంత్ రెడ్డి గురువు కేసీఆరే
ఎన్నికలెప్పుడొచ్చినా కరీంనగర్ కార్పొరేషన్ ఇగ బీజేపీదే…
*బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు తెచ్చి కరీంనగర్ ప్రజలందరికీ ఉచితంగా నీళ్లందిస్తా… *
*కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు… *
బండి సంజయ్ సమక్షంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు, ఇద్దరు కార్పొరేటర్లు చేరిక
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసే ఇండ్లకు ‘ఇందిరమ్మ’ పేరు పేడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంటే రేషన్ బియ్యంపై ప్రధాని ఫోటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇకపై కొత్త రేషన్ కార్డులపై సీఎంతోపాటు ప్రధానమంత్రి కూడా పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత బియ్యం ఎందుకు సరఫరా చేయాలని ప్రశ్నించారు. అవసరమైతే కేంద్రమే నేరుగా పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసే విషయాన్ని ఆలోచిస్తామని స్పష్టం చేశారు. దావోస్ వేదికగా లక్షల కోట్ల రూపాయల పెట్టబడులపై ఎంఓయూలు జరిగాయంటూ జరుగుతున్న ప్రచారమంతా హంబక్ అని కొట్టిపారేశారు. గత పదేళ్లలో 5 లక్షల కోట్ల రూపాయలకుపైగా పెట్టబడులు రాబోతున్నాయని అవగాహన ఒప్పందాలు చేసుకున్నారని, ఆచరణలో మాత్రం పదో వంతు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా… 2014 నుండి నేటి వరకు దావోస్ పెట్టుబడులకు సంబంధించి ఎంత మొత్తంలో ఎంఓయూలు జరిగాయి? ఎంత మందికి ఉద్యోగాలిస్తామన్నారు? ఆచరణలో ఎన్ని పెట్టబడులు వచ్చాయి? ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని సవాల్ విసిరారు.
ఈరోజు కరీంనగర్ లోని ఎస్ బీఎస్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతోపాటు ఇద్దరు కార్పొరేటర్లు, వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారందరినీ బీజేపీలో సాదరంగా ఆహ్వానిస్తూ బండి సంజయ్ కాషాయ కండువా కప్పారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు… ఏమన్నారంటే….
నరేంద్రమోదీ నాయకత్వంపై నమ్మకంతో, పార్టీ సిద్ధాంతాలు నమ్మి బీజేపీలో చేరుతున్న కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు స్వప్న, శ్రీదేవిలకు సాదర స్వాగతం. బీజేపీలో మీ చేరిక వందకు వంద శాతం ఉపయోగపడుతుంది. బీజేపీలో చేరుతామని చాలా మంది వస్తున్నారు… అయితే భూకబ్జాలకు పాల్పడే వారిని బీజేపీలో చేర్చుకోబోం. కరీంనగర్ అభివ్రుద్ధికి నిధులు తెచ్చిందెవరో నిన్నటి కేంద్ర మంత్రి రాకతో ప్రజలకు తేటతెల్లమైంది. ఇకపై ఎప్పుడు ఎన్నికలు జరిగినా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీదే.
కేంద్రం నుండి నిధులు తెచ్చినా గత 10 ఏళ్లుగా ఏనాడూ బీఆర్ఎస్ నన్ను పిలవలేదు. స్మార్ట్ సిటీ పైసలు రాకుండా నేను కొట్లాడి తెస్తే… నన్ను పిలవకుండా బీఆర్ఎస్ నేతలు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లిస్తే నేను కొట్లాడితేనే ఆ నిధులను కేసీఆర్ మంజూరు చేశారు. ఇంత కష్టపడ్డా…నన్ను ఏనాడూ ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకుండా ఇబ్బంది పెట్టారు. మోదీ ప్రభుత్వం అందించిన నిధులవల్లే కరీంనగర్ లో అభివ్రుద్ది జరిగిందని ప్రజలకు నిన్నటి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ మీటింగ్ తో అర్ధమైంది.
బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయాయి. బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ నడుస్తోంది. కేసీఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. రేవంత్ రెడ్డి గురువు కేసీఆరే. అందుకే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్, ఫాంహౌజ్ సహా స్కాంలన్నీ మరుగునపడ్డాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ రేపే అరెస్ట్ అంటూ…. నెల రోజులు ఊదరగొట్టి ఏం సాధించారు?.
కేటీఆర్ అరెస్ట్ కు అన్ని ఆధారాలున్నాయని సీఎం చెప్పిన తరువాత కూడా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?. కేసీఆర్ ఢిల్లీలో కప్పం కట్టగానే ఈఫార్ములా కేసును అటకెక్కించారు. గ్రీన్ కో వంటి సంస్థలను భయపెట్టడంవల్ల ఏం లాభం?. గ్రీన్ కో సంస్థ నుండి కాంగ్రెస్ పార్టీకి చందాల రూపంలో పైసలు ముట్టాయి. పార్టీ చందాల పేరుతో పైసలు తీసుకుని మళ్లీ ఆ సంస్థనే ఇబ్బంది పెట్టడం ఎంత వరకు కరెక్ట్?.
ఇప్పుడు దావోస్ పెట్టుబడులతో సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. 2014 నుండి ఇప్పటి వరకు దావోస్ పర్యటనల్లో ఎన్ని పెట్టుబడులుకు ఎంఓయూలు జరిగాయి? ఎంత మందికి ఉద్యోగాలిస్తామన్నారు?. ఆచరణలో ఎన్ని పెట్టబడులు వచ్చాయి? ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము కాంగ్రెస్ కు ఉందా?. బీఆర్ఎస్ స్కాంలపై దారి మళ్లించేందుకు దావోస్ పెట్టుబడుల జాతర పేరుతో ప్రచారం చేసుకుంటున్నారు.
ఫీజు రీయంబర్స్ మెంట్ అందక లక్షల మంది విద్యార్థులు అల్లాడుతున్నరు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందక చస్తున్నా పట్టించుకోరు. పెండింగ్ బిల్లులు రాక మాజీ సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నా స్పందించరు.
గ్రామాల్లో, పట్టణాల్లో అభివ్రుద్ధి పనులు జరుగుతున్నాయంటే కేంద్రం నిధులే కారణం. కేంద్రం నిధులిస్తే… దొబ్బిపోతున్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే… కేంద్రం నుండే నిధులు తెచ్చి కార్పొరేషన్ ప్రజలందరికీ 24 గంటలపాటు నీళ్లందిస్తాం.