హైదరాబాద్‌లో మోనార్క్ ట్రాక్టర్స్
1 min readహైదరాబాద్‌లో మోనార్క్ ట్రాక్టర్స్ విస్తరణకు ప్రణాళిక
* టెస్టింగ్ సదుపాయం ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థ
* ఉత్పత్తి పెంపుతో మరిన్ని ఉద్యోగాల కల్పనకు అవకాశం
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి లేఖను అందజేసిన మోనార్క్ ట్రాక్టర్స్ ప్రతినిధులు
పాలో ఆల్టో, కాలిఫోర్నియా: హైదరాబాద్‌లో తమ సంస్థ విస్తరణకు మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లోని తమ పరిశోధన-అభివృద్ధి సంస్థను విస్తరించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సంస్థ ప్రతినిధులు చర్చించారు. తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ప్రతినిధులు కలిశారు. అనంతరం సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లో తమ ఆర్ అండ్ డీ సంస్థకు అనుబంధంగా స్వయంప్రతిపత్తి ట్రాక్టర్ టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైటెక్, పర్యావరణ అనుకూల కంపెనీలను ఆకర్షించడంపై తాము దృష్టిసారించామని, మోనార్క్ ట్రాక్టర్స్‌ను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్వయంప్రతిపత్తి ,ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపామని, ఆ విజన్‌లో మోనార్క్ ట్రాక్టర్స్ బాగమై రాష్ట్రంలో తమ ఉనికిని విస్తరించుకోవాలని తాము ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో తమ కార్యకలాపాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇతర అధికారులను కలవడం ఎంతో సంతోషం కలిగించిదని మోనార్క్ ట్రాక్టర్స్ CEO ప్రవీణ్ పెన్మెత్స వెల్లడించారు. హైదరాబాద్‌లోని తమ R&D కేంద్రం అధునాతన డ్రైవర్-ఆప్షన్ స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌లను రూపొందించడంలో కీలకపాత్ర పోషించిందన్నారు. తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు తాము చూస్తున్నామని, ఫలితంగా హైదరాబాద్ ప్రాంతంలో మరింత ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు.
* ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి స్వయంప్రతిపత్తి, డ్రైవర్ తోనూ, డ్రైవర్ లేకుండానే నడిచే స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లతో మోనార్క్ ట్రాక్టర్స్ సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది.