కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి
1 min readబీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలనున్నది. ఆ పార్టీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమౌతున్నాడు. నాగర్ కర్నూల్ సీనియర్ నేత ,ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత మల్లు రవితో ఆయన భేటీ అయ్యారు. తన కుమారుడు రాజేష్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటానని దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ కు చెందిన సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తానని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు ఏ మాత్రం గౌరవం లేదని దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నాగర్ కర్నూల్ కు చెందిన దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పొసగకపోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ ను తన కుమారుడు రాజేష్ రెడ్డికి ఇప్పించుకోవాలని దామోదర్ రెడ్డి భావిస్తున్నారు. మాజీ ఎంపి పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కాంగ్రెస్ లో చేరే సమయంలో దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి చాలా కాలం కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ పార్టీ తరుపున ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. అయితే నాగం జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరిగి దామోదర్ రెడ్డి సొంత గూటికి చేరుతున్నారు.