చంద్రబాబుకు జై కొట్టిన కన్నా లక్ష్మీనారాయణ
1 min readరాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెపుతున్నారు. దీనికి అనేక ఉదాహరణలున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి పరిణామమే చోటు చేసుకోనున్నది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం గూటికి చేరుకుంటున్నారు. మొదటి నుంచి చంద్రబాబునాయుడిపైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్న కన్నా చివరికి ఆయన సమక్షంలోనే పసుపు కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 23న కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అభిమానులు, అనుచరులు ముక్తకంఠంతో టీడీపీలో చేరాలని సూచించారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్నా తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ ముఖ్యనేతగా కన్నాలక్ష్మీనారాయణ చెలామణి అయ్యారు. వైఎస్, రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు.టీడీపీ, చంద్రబాబునాయుడుపైన కన్నా ఒంటికాలిపైన లేచేవారు. ప్రధానంగా చంద్రబాబుపైన తీవ్ర విమర్శలు గుప్పించేవారు. ఆయనపైన కోర్టుల్లో పలు కేసులు కూడా వేశారు. అయితే రాష్ట్ర విభజనతో కన్నా రాజకీయ జీవితం గందరగోళంగా మారింది. కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన ఆయన ఎపి రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత సోము వీర్రాజుకు బీజేపీ పగ్గాలు ఇవ్వడంతో కన్నా లక్ష్మీనారాయణ ప్రాధాన్యత తగ్గింది.దీంతో బీజేపీని వదిలిపెట్టారు. తాజాగా తెలుగుదేశంలో చేరడానికి ఆయన సిద్ధమయ్యారు.