హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి పోశం నర్సిరెడ్డి…?
1 min readహుజూర్ నగర్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గం సమీకరణాలు మారేలా కనిపిస్తున్నాయి. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్ లో తమ సత్తా చాటడానికి పార్టీలు, నాయకులు సిద్ధమౌతున్నారు. గత ఉప ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతి పైన ఘనవిజయం సాధించిన బీఆర్ఎస్ నేత సైదిరెడ్డి మరోసారి గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన పనితీరుపై హుజూర్ నగర్ ప్రజలు సంతృప్తిగా లేనట్లు ప్రచారం జరుగుతోంది. జనానికి అందుబాటులో లేకపోవడంతో పాటు స్థానిక బీఆర్ఎస్ నేతలను కలుపుకుపోకపోవడంతో సైదిరెడ్డిపైన వ్యతిరేకత పెరిగింది. ఈ సారి ఆయన టికెట్ ఇస్తే సొంత పార్టీ నేతలే సహకరించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఈ సీటు పైన కాంగ్రెస్ నేతలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సారి యాభై వేల మెజార్టీతో గెలుస్తానని తేల్చి చెబుతున్నారు. అయితే అసలు ఉత్తమ్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదా అన్నదానిపైన కూడా చర్చ జరుగుతోంది. మరో సారి నల్గొండ ఎంపిగా పోటీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారని చెపుతున్నారు. జాతీయ రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తి ఉన్న ఆయన ఢిల్లీలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారట. ఈ సారి కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఎ విజయం సాధించే అవకాశాలు ఉండటంతో కేంద్ర మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉందన్నది ఉత్తమ్ ఆలోచన. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ పెద్దగా కనిపించడం లేదు. రేసులో పీసీసీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ భట్టి విక్రమార్క ఉండటంతో హుందాగా ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లాలని ఉత్తమ్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వారసుడు ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి ఈ సారి కోదాడ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. దీంతో ఆమెను హుజూర్ నగర్ తీసుకువచ్చే ఛాన్స్ లేకపోవడంతో కాంగ్రెస్ తరపున సరైన అభ్యర్థి కోసం పార్టీ అధిష్టానం చూస్తున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకుండా హుజూర్ నగర్ లో స్థానికంగా కాంగ్రెస్ కు బలమైన నాయకులు కనిపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీని గట్టిగా ఎదుర్కొవడానికి అన్ని విధాలుగా సరైన అభ్యర్థి ఇక్కడ ఆ పార్టీకి అవసరం. ఈ పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ పోశం నర్సిరెడ్డి పేరు తెరపైకి వస్తోంది. గత కొన్నాళ్ల నుంచి హుజూర్ నగర్ లో ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు.మేళ్లచెరువు లో పుట్టి పెరిగిన నర్సిరెడ్డి ఆ తర్వాత విదేశాలకు వెళ్లారు. పదేళ్ల క్రితం స్వదేశానికి వచ్చి సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటు చేశారు. రియల్ ఎస్టేట్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. తన సొంత ప్రాంతానికి సేవ చేయాలన్న భావనతో అనేక కార్యక్రమాలు ఆయన చేపట్టి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. అయితే హుజూర్ నగర్ ప్రజలకు మరింత సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి రావడానికి నర్సిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఈ సారి బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సంకేతాలిస్తున్నారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డితో నర్సిరెడ్డి ఈ విషయంపైన చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. తాను ఎంపిగా బరిలో ఉండి పోశం నర్సిరెడ్డి ని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించడానికి ఉత్తమ్ సుముఖంగా ఉన్నట్లు చెపుతున్నారు. ఆర్థికంగా పటిష్టంగా ఉండటంతో పాటు సేవా కార్యక్రమాలు కారణంగా ఆయన వైపు కాంగ్రెస్ నాయకత్వం కూడా మొగ్గు చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్లీన్ పర్సనాలిటీ కావడంతో పోశం నర్సిరెడ్డికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించనున్నది.