చింతల్ లో చదరపు గజం భూమి రూ. 1.14 లక్షలు

చింతల్ లో చదరపు గజం భూమి రూ. 1.14 లక్షలు
హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు భూములు
హౌసింగ్ బోర్డుకు రూ.44.24 కోట్ల మేర ఆదాయం
హైదరాబాద్ అక్టోబర్ 6,
తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్లాట్ల విక్రయాల్లో మరోసారి రికార్డు స్థాయి ధరలకు కొనుగోలు చేశారు. కుత్భుల్లాపూర్ పరిథిలోని చింతల్ లోని నివాస భూముల విక్రయాల నిమిత్తం సోమవారం నిర్వహించిన బహిరంగ వేలం ప్రక్రియలో చదరపు గజం భూమి ధర రూ.1,14,000 (లక్షా పధ్నాలుగు వేలు) పలికింది. 513 గజాల విస్తీర్ణంలోని హెచ్ ఐజి ఓపెన్ ప్లాట్ కు ఆఫ్ సెట్ ప్రైజ్ గా రూ.80 వేలు నిర్ధారించగా బహిరంగ వేలంలో చ.గజం రూ. 1.14 లక్షలకు కొనుగోలు చేసినట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ శ్రీ వి.పి.గౌతం తెలిపారు. హెచ్ ఐ జి లోనే మరో 389 చ.గజాల విస్తీర్ణంలోని ఓపెన్ ప్లాట్ ను చదరపు గజానికి లక్ష రూపాయల ధర పలికిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం మొత్తం 18 ఓపెన్ ప్లాట్లు, 4 ఫ్లాట్ల విక్రయానికి బహిరంగ వేలం వేయగా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.44.24 కోట్ల మేర ఆదాయం వచ్చింది. 27 మంది బిడ్డర్లు పాల్గొన్న ఈ వేలం పాటలో చదరపు గజానికి సగటున రూ.91,947 ధరకు కొనుగోలు చేశారని ఆయన తెలిపారు.
కెబిహెచ్ బి , గచ్చిబౌలి పరిసరాల్లోని భూములకే అధిక ధరలు పలుకుతున్న నేపథ్యంలో చింతల్ ప్రాంతంలో కూడా చదరపు గజం ధర లక్ష రూపాయలు దాటడం విశేషం. నగరంలోని అన్ని ప్రాంతాల్లో నివాస భూములకు మంచి డిమాండ్ ఉందనడానికి ఇది నిదర్శనమని అంటున్నారు.