రేవంత్ రెడ్డికి తోడుగా ప్రశాంత్ కిషోర్..?

1 min read

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో సమీకరణాలు మార్పులు వస్తున్నాయి. ఘోరంగా భంగపడిన కాంగ్రెస్ మళ్లీ కోలుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటికే అసమ్మతి నేతలతో ఆమె సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ కోసం వ్యూహాకర్తను నియమించుకునేందుకు రాహుల్ గాంధీ సన్నద్దమయ్యారు. త్వరలో ఎన్నికలు జరిగే గుజరాత్ కోసం ప్రశాంత్ కిషోర్ ను తీసుకురావడానికి ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రశాంత్ కిషోర్ పనిచేసేలా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఆయనను పార్టీలో చేర్చుకొని ప్రధాన కార్యదర్శి పదవి అప్పగిస్తారనే చెపుతున్నారు. సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా ఉన్న అహ్మద్ పటేల్ కరోనాతో చనిపోయారు. దీంతో అధినేత్రికి, పార్టీ నేతలకు మధ్య సమన్వయం చేసేవాళ్లు కరువయ్యారు. ప్రశాంత్ కిషోర్ ను పార్టీలోకి చేర్చుకొని రాజకీయ సలహాదారు బాధ్యతలు ఇస్తారని చెపుతున్నారు. ఇందుకు రాహుల్ గాంధీ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మరో వైపు గుజరాత్ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తరుపున పని చేయడానికి సిద్ధమౌతున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రానికి చెందిన ముఖ్యనాయకులు ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. 2023లో జరిగే కర్ణాటక, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకునే సూచనలున్నాయి. ప్రస్తుతం రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ ల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్ ల్లో కూడా గెలవాలని ఆరాటపడుతోంది. అందుకే ప్రశాంత్ కిషోర్ వైపు మొగ్గు చూపిస్తుందని తెలుస్తోంది.

మరో వైపు తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్ తో ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఆయన కలిశారు.  పీకేతో కలిసి పనిచేస్తున్నట్లు కేసీఆర్ మీడియా ముందు అంగీకరించారు. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం తెలంగాణలో పరిస్థితులను తెలుసుకోవడం కోసమే కేసీఆర్ ను కలిశానని చెపుతున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ తో తమకెలాంటి ఒప్పందం జరగలేదని ఆయన స్పష్టం చేశారట. ఒక వేళ కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని ప్రశాంత్ కిషోర్ భావిస్తే కేసీఆర్ ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది.  అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్లు అవుతుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇది ఎంతగానో కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. రేవంత్ క్రేజ్ కి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు తోడైతే టీఆర్ఎస్ ని సులభంగా ఎదుర్కొనే అవకాశముంది. తమకు పీకే అవసరం లేదని ఇప్పటికే రేవంత్ రెడ్డి చెపుతున్నారు. అయితే అధిష్టానం ఆదేశిస్తే ప్రశాంత్ కిషోర్ తో పనిచేయడానికి రేవంత్ కి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn