రేవంత్ రెడ్డి పాదయాత్రకు పోటీ యాత్ర

1 min read

తెలంగాణ కాంగ్రెస్ లో పాదయాత్ర లొల్లి మొదలయ్యేలా కనిపిస్తోంది.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే పాదయాత్ర చేస్తుండగా మరో టీం కూడా ఇందుకు రెఢీ అవుతోంది. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పోటీగా భట్టిని రంగంలోకి దింపడానికి ఈ వర్గం ప్రయత్నం చేస్తున్నారు. రాయపూర్ ఫ్లీనరీ తర్వాత పోటీ పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించనున్నారు. ఖమ్మం లేదా ఆదిలాబాద్ జిల్లా నుంచి భట్టి పాదయాత్ర ప్రారంభం కానున్నది. రేవంత్ రెడ్డి తరహాలోనే నియోజకవర్గానికి ఒక రోజు పాటు పాదయాత్ర చేసి బహిరంగ సభ నిర్వహిస్తారు. అయితే భట్టి విక్రమార్క కు ఎన్ని నియోజకవర్గాల నుంచి ఆహ్వానం వస్తుందో చూడాల్సి ఉంది.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. రాయ్ పూర్ ఫ్లీనరీ కారణంగా మూడు రోజుల పాట విరామం తీసుకున్నారు. ఆ తర్వాత పరకాల నుంచి పాదయాత్ర మళ్లీ ప్రారంభం అవుతోంది. వరంగల్ జిల్లాలో ముగిసిన వెంటనే ఉమ్మడి కరీంనగర్ లో రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉండనున్నది. మిగిలిన జిల్లాల నుంచి నాయకులు పెద్ద ఎత్తున రేవంత్ యాత్ర కోసం డిమాండ్ చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా నియోజకవర్గాల్లో మంచి ఊపు వస్తుందని భావిస్తున్న నేతలు రేవంత్ రెడ్డి కి ఆహ్వానాలు పలుకుతున్నారు. ఇప్పటికే పాదయాత్ర జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి. కార్నర్ మీటింగ్ ల్లో రేవంత్ రెడ్డి స్పీచ్ పార్టీ శ్రేణులకు ఊపునిస్తోంది. ప్రత్యర్థులపైన మాటల తూటాలను పేలుస్తు కాంగ్రెస్ కేడర్ లో ధైర్యం నింపడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ స్వయంగా తమ ప్రాంతాల్లో నడస్తుండటంతో పార్టీ కార్యకర్తలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగాలని డిమాండ్ ఊపుందుకుంది.

ఈ సమయంలో పోటీ పాదయాత్ర కు భట్టి విక్రమార్క ప్రయత్నాలు చేస్తుండటం కాంగ్రెస్ వర్గాల్లో మరో సారి చర్చకు దారి తీసింది. సిఎల్పీ నేత హోదాలో భట్టి విక్రమార్కకు పాదయాత్ర చేసే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం కూడా సీనియర్లు నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని సూచించింది. కాని వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మాత్రం కేడర్ లో గందరగోళం నెలకొనే ఛాన్స్ ఉంది. దీనికి తోడు తమ ప్రాంతానికి ఎవరిని పాదయాత్ర కోసం ఆహ్వానించాలన్న సందిగ్థంలో నాయకులున్నారు. రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజ్ కారణంగా ఎక్కువ మంది ఆయన వైపే మొగ్గు చూపిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు కూడా రేవంత్ నే తీసుకురావాలని పట్టుపడుతున్నారు. రేవంత్ రెడ్డి కాకుండా భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహిస్తే నామమాత్రపు స్పందన వచ్చే ఛాన్స్ ఉంది. కార్యక్రమం విజయవంతం కాకపోతే అసలుకే మోసం వస్తుందని నాయకులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు ఎంపి కోమటిరెడ్డి కూడా తాను పాదయాత్ర లేదా బైక్ యాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఉమ్మడి నల్గొండతో పాటు మరికొన్ని నియోజవర్గాల్లో కార్యక్రమం కోసం ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. కాని ఆయనను నాలుగైదు నియోజకవర్గాలు మినహా మరెక్కడికి ఆహ్వానించే ఛాన్స్ కనిపించడం లేదు. ఉత్తమ్ కుమార్  రెడ్డి కోదాడ,హుజూర్ నగర్ ల్లో మాత్రమే పాదయాత్ర పెట్టుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ లో పాదయాత్ర మరో లొల్లికి దారి తీసేలా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn