వ్యాక్సిన్ కోసం రేవంత్ రెడ్డి పోరాటం

1 min read

మల్కాజ్ గిరి ఎం.పి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కరోనా వ్యాక్సిన్ పైన యుద్ధం ప్రారంభించారు. అందరికి వ్యాక్సిన్ ను అందించాలన్న డిమాండ్ తో ఆయన పోరాటం మొదలు పెట్టారు. కరోనాతో అల్లాడుతున్న జనానికి ఉపశమనం కల్గడానికి  వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని రేవంత్ రెడ్డి చెపుతున్నారు. వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికి రెండు డోసుల వ్యాక్సిన్ అందించాలని ఆయన సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వల్ల కరోనా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెపుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి డిమాండ్ సహేతుకంగా కనిపిస్తోంది. దేశంలో  ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తయారు చేసింది. పుణే కేంద్రంగా ఉన్న సిరమ్ ఇనిస్ట్యూట్ కోవీషిల్డ్ వ్యాక్సిన్ ను రూపొందించింది. విదేశాలకు చెందిన ఒకటి రెండు వ్యాక్సిన్లు వచ్చినప్పటికి ఇప్పటి వరకు వాటి తయారీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ఇంకా సమయం పట్టే అవకాశముంది. దీంతో దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. వ్యాక్సిన్ కోసం జనం సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. మే 1 నుంచి 18 యేళ్లు నిండిన వాళ్లకు కూడా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. కాని ఇప్పటి వరకు అమలు కావడం లేదు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ దొరకడం లేదు. ప్రస్తుతం 45 యేళ్లు పై బడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. అందరికి వ్యాక్సిన్ అందాలంటే కనీసం మరో యేడాది పట్టే అవకాశం ఉంది. ఒక వైపు కరోనాతో జనం పిట్టలారాలుతున్న సమయంలో వ్యాక్సిన్ లేకపోవడం అంటే చేజేతులా ప్రాణాలు తీసుకున్నట్లే అవుతుంది.

 

ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ తయారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరీపైన విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్ పేటెంట్లు, లైసెన్స్ లను సడిలించే విషయంలో మోదీ సర్కార్ చొరవ చూపించడం లేదు. ప్రస్తుత అత్యవసర పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకొని కంపెనీల లైసెన్స్ విధానంలో మార్పులు తీసుకురావాల్సి ఉంది. వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్, సిరిమ్ ఇనిస్ట్యూట్ లు మాత్రమే పాల్గొంటున్నాయి. దీంతో ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటోంది. వ్యాక్సిన్ డిమాండ్ ,సప్లయ్ మధ్య భారీ వ్యత్యాసం ఉంది. దీన్ని ద్రుష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ ఉత్పత్తి ఇతర ఫార్మా కంపెనీల్లో కూడా జరిగేలా చూడాలని ఎం.పి రేవంత్ రెడ్డి కొన్నాళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మొదట చెప్పింది కూడా రేవంత్ రెడ్డే కావడం విశేషం. లైసెన్సింగ్ విధానంలో మార్పులు తీసుకువచ్చి ఫార్ములాను ఇతర కంపెనీలకు ఇచ్చి ఉత్పత్తి పెంచాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. అంటురోగాల నిరోధక చట్టం కింద పేటెంట్ రైట్స్ కేంద్రం తన పరిధిలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని ఆయన అంటున్నారు. వ్యాక్సిన్ తయారీ కోసం కంపెనీలకు కేంద్రం ఆర్థిక సాయం అందించిందని రేవంత్  గుర్తు చేస్తున్నారు. 100 కోట్ల మందికి తక్షణమే వ్యాక్సిన్ ఇవ్వాలంటే వ్యాపార కోణంతో కాకుండా మానవతా కోణంలో ఆలోచించాలని ఆయన ప్రధానిని కోరారు. దీనిపైన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు.

 

ఇదే సమయంలో రేవంత్ రెడ్డి డిమాండ్ కు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ కు చెందిన పలువురు సీనియర్ నేతలు రేవంత్ వాదనతో ఏకీభవిస్తున్నారు.మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ తో పాటు కీలక నాయకులు ఈ విషయంపైన ప్రధానికి లేఖలు రాయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn