చిన్న సాయం.. పెద్ద బహుమతి

ఓ చిన్న వీడియో ఆమెలోని మానవత్వాన్ని ప్రపంచానికి చాటింది.చేసిన చిరుసాయం ఆమెకు పెద్ద బహుమతిని ఇచ్చింది. అందరి మనసులను ఆకట్టుకున్న ఆ మహిళ ఇప్పుడు సినిమా హీరోలకు మించిన క్రేజ్ ను తెచ్చుకుంది. కేరళలో జరిగిన ఈ సంఘటన మానవత్వం గొప్పతనాన్ని మరో సారి చాటింది. మానవత్వానికి చావు లేదన్న సంకేతాలను బలంగా ఇచ్చింది.

ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో విస్త్రుతంగా ప్రచారంలో ఉంది. మహిళ ఒకరు అంధుడిని బస్సు ఎక్కించడానికి పడ్డ తాపత్రయం ప్రతి ఒక్కరిని కదిలించింది. అతనికి సాయం చేయడం కోసం ఆమె రోడ్డుపైన పరుగులు పెట్టిన తీరు నెటిజన్ల గుండెలను తట్టింది. కేరళలోని తిరుపత్తూరు జిల్లా తిరువల్లకు చెందిన సుప్రియ చేసిన పని ప్రతి ఒక్కరి మనసును తడి చేసింది. జాయ్ ఆలుకాస్ సంస్థలో పని చేస్తున్న సుప్రియ ఒక రోజు రోడ్డు పైన నడుచుకుంటు వెళ్తోంది. ఈ సమయంలో అక్కడ అంధుడు బస్సు కోసం వేచి చూస్తున్నాడు. అంతలో బస్సు ఆతడు ఉన్న ప్రాంతంలో కాకుండా బాగా ముందుకు వెళ్లి ఆగింది. ఆ అంధుడిని ఎక్కించాలన్న తాపత్రయంతో సుప్రీయ బస్సు వెంట పరుగెత్తుకెళ్లింది. బస్సును ఆపించి మళ్లీ వెనక్కు పరుగుపెట్టి ఆ అంధుడిని తీసుకెళ్లి జాగ్రత్తగా ఎక్కించింది. సుప్రియ చేసిన ఈ పనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. సుప్రియ మానవత్వం అందరిని కదిలించింది. ఆమె పని చేస్తున్న జాయ్ ఆలుకాస్ గ్రూప్ ఛైర్మన్ ఈ వీడియోను చూసి సుప్రియను అభినందించడానికి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లారు. చిన్న అద్దె ఇంట్లో ఉన్న ఆమె పరిస్థితిని చూసి త్రిస్సూర్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అక్కడికి వెళ్లిన సుప్రియకు ఎన్నడూ మరిచిపోలేని బహుమతిని జాయ్ ఆలుకాస్ ఇచ్చారు. చక్కటి ఇళ్లును ఆయన గిఫ్ట్ గా ఇవ్వడంతో సుప్రియ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆయన సతీమణి జొల్లి ఆలుకాస్ కూడా ఆమెను ఘనంగా సత్కరించారు. సుప్రియ నిస్వార్థంగా ఆ అంధుడికి సాయం చేసినప్పటికి ప్రపంచం ఆమె మానవత్వాన్ని గుర్తించింది.ఆమె చేసిన పని మరెందరికో స్పూర్తిదాయకంగా నిలిచింది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!