రాజకీయ సోపానంలో మొదటి మెట్టు..వెంకయ్య నాయుడు

ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే… జీవితంలో ఎన్నడుగులు ముందుకు వేసినా, ప్రారంభమైన చోటు మాత్రం చాలా విలువైనది. ఒక గింజ మొలకెత్తడానికి ఎంత తపన పడుతుందో, అంతే తపన మొదటి మెట్టు దగ్గర విజయాన్ని సాధించిన ప్రతి మనిషి పడతాడు. ఈ రోజు నేను ఉపరాష్ట్రపతిని. కానీ నా ప్రస్థానం ప్రారంభమైన చోటు మాత్రం “ఉదయగిరి”. ఒక సాధారణ విద్యార్థి నాయకుడు, ఏ మాత్రం పెద్దగా పరిచయం లేని పార్టీ, కానీ ప్రజల నమ్మకం, ముప్పవరపు వెంకయ్య నాయుడు గెలుపుగా మారి ఎమ్మెల్యేను చేసింది. అది మరచిపోలేని సందర్భం. ఉదయగిరి నా రాజకీయ సోపానంలో మొదటి మెట్టు. అక్కడి ప్రజలంతా నా వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఎప్పటికీ మరపు రాని వ్యక్తులు.


ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, స్వీయ నియంత్రణ కారణంగా నియమనిబంధనలను అనుసరించి మిగతా ప్రజలందరితో పాటే భారతదేశ రెండవ పౌరుడిగా నేను కూడా ఇంటికే, ఏకాంత వాసానికి పరిమితం అయ్యాను. ఆలోచించే మనసు, సంభాషించే నోరు, పర్యటించే కాలు ఊరికే ఉండలేవని సామెత. ఒక్క ఎమర్జెన్సీ సమయంలో 18 నెలలు తప్ప ఎప్పుడూ ఒక పట్టాన ఒక చోట ఉండడం అలవాటు లేదు. అలాంటి నాకు ఇదో కొత్త అనుభవం. అయితే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో, ఒక్క సారి పాత మిత్రులు, అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, సహచరులు… ఇలా అందరితో ఈ సందర్భంగా మాట్లాడాలని ఆలోచన కలిగింది. కలిగిందే తడవుగా వరుసగా ఫోన్ చేసి పలకరిస్తున్నాను. అందరితో ఫోన్ ద్వారా మాట్లాడుతుంటే పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటే గుర్తుకు వస్తున్నాయి.


“కనెక్ట్ పీపుల్” కార్యక్రమంలో భాగంగా మొదటగా నేను రాజ్యసభ సభ్యులను, పార్లమెంటులోనివివిధ పార్టీల ప్రముఖ నాయకులను, తదుపరి నా రాజకీయ జీవితంలో నాటి సహచరులను, సీనియర్లను, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యుల్ని పలకరించాను. తర్వాత ఢిల్లీ, హైదరాబాద్ లో ఉన్న అలనాటి, ప్రస్తుత పాత్రికేయ మిత్రులను పలకరించాను. ఆ తర్వాత కాలేజీల్లో, విశ్వ విద్యాలయాల్లో నాటి సహచరులు, వివిధ ఉద్యమాల్లో నాతో కలిసి పని చేసిన ఉద్యమ మిత్రుల క్షేమ సమాచారాలను కనుక్కున్నాను. ఆలాగే జీవితంలో వివిధ సందర్భాల్లో నేను కలిసిన వారు, సమాజానికి మార్గనిర్దేశ చేస్తున్న ఆధ్యాత్మిక వేత్తలు, ప్రవచనకర్తలు, సహచరులు, అనుచరులు… ఇలా అందరినీ పలకరించగలగడం సంతోషంగా అనిపించింది. కొంత మంది కాలం చేయగా, మరి కొంత మంది నా వయసుకు చేరుకున్నారు. ఇంకొంత మంది కాస్త ముందుకు వెళ్ళి నాకంటే పెద్ద వయసులో ఉన్నారు. ఇదంతా కాల మహిమే.


నెల్లూరు వీధుల్లో నడయాడిన రోజులు, పాత కళాశాల జ్ఞాపకాలు, నాటి ఉద్యమాలు, లాఠీదెబ్బలు, అరెస్టులు ఇవన్నీ తలచుకున్నప్పుడు మనసు పులకరిస్తున్నది. ముఖ్యంగా నా జీవిత సోపానంలో ఉదయగిరి మొదటి మైలురాయి. నేను రాజకీయంగా విజయవంతం కావడానికి కారణం అక్కడి ప్రజలే. ఆ తర్వాత రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా, అధికార పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎదగడానికి కారణం కూడా అక్కడి ప్రజలే. ఉదయగిరి నా రాజకీయ పునాది. మూడో సారి వివిధ పరిస్థితుల నేపథ్యంలో ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు కూడా ఉదయగిరి నుంచే పోటీ చేసి, మళ్ళీ గెలిచి ఉంటే, పరిస్థితి మరో రకంగా ఉండేదేమో. 1985లో ఆత్మకూరులో ఓడిపోకుంటే, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి నేను ఎంతో అభిమానించే అటల్ జీ, అద్వానీజీల మధ్య కూర్చునే అవకాశం దక్కి ఉండేది కాదేమో. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజ్యాంగ బాధ్యతల్లోకి బహుశా రాగలిగి ఉండేవాణ్ని కాదేమో.
ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్ళలో ఉదయగిరి నియోజకవర్గంలో నేను పలకరించని మనిషి, అడుగు పెట్టని గడప, చేయి కడగని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే నేను ధనం ఖర్చు పెట్టి గెలవలేదు. 1978లో, 83లో అసెంబ్లీకి ప్రజలు గెలిపించి పంపించారు. 77లో రాష్ట్రంలో జనతాకు ఒక్క సీటే వచ్చినా ఉదయగిరి అసెంబ్లీ స్థానంలో మెజార్టీ ఇచ్చారు. 78లో జిల్లా మొత్తం కాంగ్రెస్ ప్రభంజన వీచినా ఉదయగిరి ప్రజలు నన్ను గెలిపించారు. అలాగే 83లో శాసనసభలో, పార్టీలో చురుగ్గా ఉన్న నన్ను ఓడించేందుకు నాటి అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డినా ప్రజలకు నా మీద నమ్మకం సడలలేదు. నా ప్రత్యర్థి వైపు ప్రచారం చేయడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తరలివచ్చింది. ప్రజలంతా హెలికాఫ్టర్ చూడ్డానికి వచ్చారే తప్ప, వారి అభ్యర్థిని గెలిపించ లేదు. ఇక ఎన్టీఆర్ ప్రభంజనం కొనసాగుతున్నా, ప్రజలు నా మీద నమ్మకం ఉంచారే తప్ప, ఎన్టీఆర్ గాలి ఉదయగిరిని తాకలేదు. ఉదయగిరి ప్రజలంతా నన్ను తమ బిడ్డలా ఆదరించారు. అన్ని విధాలా నన్ను ప్రోత్సహించారు. అందుకే నేను కేంద్రంలో అధికార పార్టీ అధ్యక్షుణ్ని అయినా, ఇద్దరు ప్రధానుల ప్రభుత్వాల్లో కీలకమైన కేంద్ర మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టినా, భారతదేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎంపికైనా నా రాజకీయ జీవితానికి మేలి మలుపు అయిన ఉదయగిరి జ్ఞాపకాలు నాకు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఆ జ్ఞాపకాలను అవలోకనం చేసుకోవడానికి మళ్లీ ఇప్పుడు అవకాశం వచ్చింది.


పెద్దలు శ్రీ ధనెంకుల నరసింహం గారు గ్రామగ్రామాన నన్ను 1977లో అందరికీ మొదట పరిచయం చేశారు. ఆ తర్వాత ప్రజలు అలాగే హత్తుకుపోయారు. నేను విడిచి వచ్చే వరకూ ప్రచారంలో ఎవరి ఖర్చు వారిదే. వారి ట్రాక్టర్లు, మోటారు సైకిళ్ళు, ఎడ్లబండ్లు స్వచ్ఛందంగా తీసుకొచ్చేవారు.ఆరోజుల్లో ప్రతి ఊరి వారు వారే ఖర్చులు భరించే వారు. నేను గ్రామాలకు వెళ్తే స్వాగతించి, ఊరేగించి, రచ్చబండ, దేవాలయాల దగ్గరకు తీసుకెళ్ళి హారతి ఇచ్చి, కొబ్బరికాయ, తాంబూలాలు ఇచ్చి, శక్తి కొలది రూ. 200, రూ. 500 ఇచ్చి ఆశీర్వదించే వారు.కులాలకు, మతాలకు అతీతంగా వారంతా నన్ను ఆదరించే వారు.నేను తెలియకపోవడం వల్ల 77లో ఆదరించకపోయినా, తదనంతరం ముస్లింలు సైతం అధిక సంఖ్యలో అభిమానులు అయిపోయారు. ఉదయగిరి సర్పంచి శ్రీ మజీద్, స్టాంపుల గౌస్ మొహిద్దీన్, ఖాదర్ బాషా ఆధ్వర్యంలో మంచి మద్ధతుదారులుగా నిలచి, ఆఖరికిశ్రీ అటల్ జీఉదయగిరి మీటింగ్ కు శ్రీ మజీద్ అధ్యక్షత వహించే స్థాయికి నా పట్ల అభిమానం పెరిగింది. పర్యటనల్లో ఆ ప్రాంతాల్లో, గ్రామాల్లో బసలు, వారు చేసినఏర్పాట్లు, రుచికరమైన స్థానిక వంటకాలు, నా జీపుకు వారే డీజిల్ పోయించడం, వాగుల్లో దాట లేకుంటే జీపును నెట్టి గట్టుకు చేర్చడం… ఇలా ఆ జ్ఞాపకాలు మనసును ఆహ్లాద పరుస్తున్నాయి. శ్రీ చెంచురామయ్య, శ్రీ జానకీరామ్, శ్రీ రాజమోహన రెడ్డి గార్లు నాతో తలబడినప్పటికీ, ఎప్పుడూ శత్రు భావన చూపించలేదు.


ఉదయగిరి నియోజక వర్గంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఉదయగిరికి పేరు తేవడమే గాకుండా నాటి తాగునీరు, సాగునీరు, విద్యుత్, విద్యా సమస్యలు, రవాణా, రహదారి సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారించి చాలా వరకూ ముందుకు తీసుకెళ్ళగలిగాను.వెనుకబడిన ప్రాంతమైనప్పటికీ మహిళలు సైతం ఆదరపూర్వకంగా అభిమానం చూపేవారు. ఆ రోజుల్లో ఆడపడుచులు చూపించిన ఆభిమానం గురించి ప్రత్యేకంగా పేర్కొనాలి. 1983లో కొద్ది గ్రామాల్లో పురుషులు కాస్త అటు, ఇటు ఊగిసలాడినా ఆడపడుచులు వారిని వారించి అంతా నా వైపు నిలించారు. ఆరోజుల్లో గ్రామగ్రామాన పర్యటించడం, విద్యార్థులకు హాస్టళ్ళు, ఆసుపత్రుల అభివృద్ధి, సూళ్ళు, కళాశాలల మంజూరు, ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించడం, అసెంబ్లీలో ప్రజావాణి ప్రముఖంగా వినిపించడం, స్థానిక పరిపాలనలో అవినీతిని అరికట్టడం, అభివృద్ధిని అందించడం వారందరి ఆదరణకు కారణమని నేను భావిస్తాను. అందుకే అభివృద్ధిని చూసిన ప్రజలు 1983 లో రెండవ సారి రెండు వంతుల మెజారిటీ తో గెలిపించారు. 1984లో ఆగష్టు ప్రజాస్వామ్య సంరక్షణ ఉద్యమంలో (శ్రీ ఎన్టీఆర్ ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు) ముందుండి, 1985 మధ్యంతర ఎన్నికల్లో రాజకీయ కారణాల వల్ల ఉదయగిరిని వదలి, ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న సమయంలో ఉదయగిరి నియోజక వర్గ ప్రజలు గ్రామగ్రామన బాధపడ్డారు. నెల్లూరు వచ్చి, మా ఇంటికి వచ్చి రెండు రోజుల పాటు అభిమానంగానే నా పై ఒత్తిడి తెచ్చి, నా మనసు మార్చే ప్రయత్నం చేశారు. అయినా మాట ఇచ్చానని నచ్చజెప్పి ఆత్మకూరు నుంచే పోటీ చేశాను. ఆత్మకూరులో చాల స్వల్ప ఓట్ల తేడాలో నా విజయం చేజారిన సమయంలో కూడా ఉదయగిరి వాసులు బాధపడిన విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే ఆ జ్ఞాపకాలు చిరస్మరణీయాలు. నాటికి, నేటికీ ఎంత మార్పో. మాట్లాడుతుంటే పెద్దవాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తుంటే, పిల్లలు వాళ్ళ పెద్దలు నా గురించి చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఉదయగిరి నా జీవిత మస్తిష్కంలో నిలిచిపోతుంది.


ఇప్పుడు ఈ స్థాయిలో ఉండి అందరినీ పలకరించడంలో భాగంగా, నేను మొదటి మెట్టు విజయవంతంగా ఎదిగిన ఉదయగిరి ప్రజలను పలకరించాలి, వారి క్షేమ సమాచారాలు కనుక్కోవాలి అనుకున్నదే తడవుగా గత వారం రోజుల నుంచి అక్కడి వారందరికీ ప్రతి రోజు ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేసి పలకరిస్తుంటే వారెంతో సంతోషపడుతున్నారు. అంతకు మించి నేను ఆనందపడుతున్నాను. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొంతమంది అప్పుడప్పుడు కలుస్తుండే వారు. రాజ్యాంగ బాధ్యతల్లోకి రావడంతో నేను నెల్లూరు రావడం, వారు కలవడం బాగా తగ్గిపోయింది. ఇప్పుడుఫోన్లు చేస్తుంటే పాతవారు కొందరు కాలం చేశారని తెలిసింది. వారి పిల్లలతో మాట్లాడుతున్నాను. క్రమేపి ఉదయగిరి ప్రాంతంలో వర్షాభావం ఎక్కువ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నేను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శాశ్వత పరిష్కారానికి నీటి పథకం రూపొందించి, ప్రపంచ బ్యాంకుకు నివేదించాలని నిర్ణయించి, ప్రతిపాదనలు సిద్ధం చేయించడం జరిగింది. సుమారు 200 కోట్లు అంచనా వేయడం జరిగింది. తర్వాత ఇది పెరిగింది కూడా. సరిగ్గా ఆ సమయంలోనే నేను రాజకీయాల నుంచి, ప్రభుత్వం నుంచి తప్పుకోవడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అనధికారికంగా మళ్లీ చొరవ తీసుకుంటాను.
నాటి రోజుల జ్ఞాపకాలు, అనుభూతులు ఎంతో మధురమైనవి. ఒక్కో ఊరి వారితో మాట్లాడుతుంటే ఆ ఊరి పాత సంగతులు, వాటి ప్రగతి, వారి ప్రేమాభిమానాలు గుర్తుకు వచ్చి, నా మనసు మరింత ఉద్వేగంతోఆనందభరితం అవుతోంది. స్వీయ నిర్బంధ నిబంధనలు మర్చిపోయి మళ్ళీ ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నానా అనే అనుభూతి కలుగుతోంది. అది చెప్పనలవిగాని సంతోషం. నాటితో పోలిస్తే నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. 77, 78, 83 ఎన్నికల్లో నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదంటే చాలా మందికి ఆశ్చర్యం వేయవచ్చు. నమ్మశక్యం కూడా కాకపోవచ్చు. కానీ అది వాస్తవం. ప్రజల ప్రేమాభిమానాలే నాడు నన్ను గెలిపించి, ఇంత వాణ్ని చేశాయి. ఉపరాష్ట్రపతి అయినా ఉదయగిరి స్మృతులు ఎప్పటికీ మధురమే. రాజకీయ జీవితపు తొలినాళ్ళలో నా ఉన్నతికి కారణమైన ఉదయగిరి ప్రజలంటే సతీమణి ఉషమ్మకు, కుమారుడు హర్షవర్థన్ కు, కుమార్తెదీపమ్మకు కూడా ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఆ జ్ఞాపకాలు నేటికీ మధురానుభూతుల్ని పంచుతున్నాయి.

కరోనా మహమ్మారి నేపథ్యంలో అందరం స్వీయ గృహ నియంత్రణ (హోమ్ క్వారంటైన్) పాటిస్తూ, అత్యవసరమై బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ను ధరించి, సురక్షిత దూరాన్ని (సేఫ్ డిస్టెన్సింగ్) పాటిస్తూ జాగ్రత్త పడదాం. ఇంట్లోనే ఉందాం. సురక్షితంగా ఉందాం. మహమ్మారిని తరిమేద్దాం.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!