బాడీ షేప్ తగ్గటు చీరలు

చీర కట్టుకుంటే అందంగా కనిపించాలి.. ఆధునికంగా ఉండాలి.. సౌకర్యంగా ఉండాలి.. మెరిసిపోవాలి.. వీటన్నిటితో పాటు ట్రెండీగానూ కనిపించాలి.. ఇవి ఈ తరం మహిళలు కోరుకునేవి. అయితే… ఎత్తు, బరువు, షేప్‌లను అనుసరించి చీరలను ఎంచుకోవాలి. ఆకట్టుకునే చీరకట్టుతో మెరిసిపోవాలంటే.. ఎలాంటి చీరలను కట్టుకోవాలో ఒక సారి పరిశీలిద్దాం..

ఎక్కువ హైట్ ఉన్న వాళ్లు ఏ చీర కట్టుకున్నా అందంగానే కనిపిస్తారు. వారికి చీర బాగా నప్పుతుంది. వారి లుక్కే కూడా వేరుగా ఉంటుంది. పెద్ద బార్డర్స్ ఉన్న చీరలైతే ఇంకా బాగుంటాయి. బోల్డ్ ప్రింట్స్‌తో వెరైటీ కలర్స్ ఎంచుకుంటే మరింత బాగుంటారు. ఇంగ్లీషు కలర్స్ అదిరిపోతాయి.దీని వల్ల అందరి దృష్టి రంగుపైకి వెళుతుంది కాని పొడవు గురించి ఆలోచించరు.

ఇక ఎత్తు తక్కువగా ఉన్న వారు మాకు చీరలు సూటవ్వవు అనుకుంటారు. కాని పొట్టిగా ఉన్నప్పటికి కూడా చీరలు బాగుంటాయి. అయితే ఎంచుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. పొట్టిగా ఉన్నవారు పెద్ద ప్రింట్స్, హెవీగా ఉన్న బార్డర్స్ ఉన్న చీరల జోలికి వెళ్లవద్దు. చిన్న బార్డర్‌ ఉన్న చీరలు ఉండేట్లుగా చూసుకోవాలి. అలాగే.. చీర మొత్తం కూడా చిన్న చిన్న ప్రింట్స్ అయితే బాగుంటుంది. పొట్టిగా, లావుగా ఉన్నప్పటికి లేటెస్ట్ ఫ్యాషన్స్ ను ఫాలో అయితే అదిరిపోయే లుక్ తెచ్చుకోవచ్చు.

నడుము నాజూకుగా ఉండి, పై భాగం, కింది భాగం ఎక్కువగా ఉన్నవాళ్లు జార్జెట్, షిఫాన్, నెట్ ఫ్యాబ్రిక్ చీరలను ఎంచుకోవచ్చు. వీరికి డార్క్ కలర్స్ వీళ్ల అందాన్ని రెట్టింపు చేస్తాయి. హెవీ ఎంబ్రాయిడరీ చీరల జోలికి పోకూడదు. సింపుల్‌గా ఉండే ఎంబ్రాయిడరీ, బీడ్ వర్క్ చీరలు వీరికి బాగుంటాయి. పలుచటి చీరలైతే అదిరిపోయే లుక్ ఖాయం. క్రిస్, క్రాస్ స్ట్రింగ్స్ ఉన్న జాకెట్లు మరింత బాగుంటాయి.

ఇక లావుగా ఉన్న వాళ్లు చీరల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాటన్ లాంటి మందం చీరల జోలికి వీళ్లు వెళ్ల వద్దు. షిఫాన్, సిల్క్ చీరలు కట్టుకుంటే సన్నగా కనిపించే ఛాన్స్ ఉంటుంది . అలాగే ముదురు రంగుల దుస్తుల వల్ల లావుగా కనిపించరు. ఇలాంటివారు హ్యాండ్‌లూమ్ చీరలను కట్టుకోవచ్చు. ఫుల్ స్లీవ్స్, లాంగ్ లెంగ్త్ బ్లౌజ్‌లు వీరి అందాన్ని రెట్టింపు చేస్తాయి. లావుగా ఉన్నవారు చీర కట్టే విధానం సింపుల్‌గా ఉండేలా జాగ్రత్త పడాలి.

సన్నగా ఉన్నవారు కాటన్, సిల్క్, ఆర్గంజా చీరలను ఎంచుకోవచ్చు. దీని వల్ల కొంత బొద్దుగా, అందంగా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. లైట్ కలర్స్, హెవీ ఎంబ్రాయిడరీ చీరలు వీరికి బాగుంటాయి. బ్రొకేడ్, బీడ్ వర్క్ చీరలు కొత్తందాలను తెస్తాయి. బ్యాక్‌లెస్, స్లీవ్‌లెస్, హాల్టర్ నెక్, ట్యూబ్ బ్లౌజ్‌లతో అందరి మతులనూ పోగొట్టవచ్చు.

పియర్ షేప్ ఉన్నవాళ్లకు పై భాగంతో పోలిస్తే కింది భాగం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి షిఫాన్, జార్జెట్ చీరలను ఎంచుకుంటే బాగుంటుంది. అలాగే చేపలా చీరను చుట్టకుండా కుచ్చిళ్లు పెద్దగా పెట్టి, కొంగు సింపుల్‌గా వేస్తే సరిపోతుంది. వీరికి బోల్డ్, లైట్ కలర్స్ నప్పుతాయి. చిన్న ప్రింట్స్, ఎంబ్రాయిడరీ, పెద్ద బార్డర్‌లు వచ్చిన చీరలను ఎంచుకోవచ్చు.

యాపిల్ షేప్ ఉన్న వాళ్లు అంటే పొట్ట, పై భాగం ఎక్కువగా ఉన్నవాళ్లు ఎంబ్రాయిడరీ ఎక్కువగా వచ్చిన చీరలను ఎంచుకోవాలి. కొన్ని భాగాల్ని కప్పేలాగా ఉంటూ, జాకెట్టు కచ్చితంగా పొడుగు చేతులు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటివారికి సిల్క్ చీరలు నప్పుతాయి. నెట్ ఫ్యాబ్రిక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంచుకోకూడదు. అలాగే ఇలాంటివారు ఉల్టా పల్లూని ట్రై చేయవచ్చు. అవసరమైన చీరలకు కాంట్రాస్ట్ జాకెట్లను ఎంచుకుంటే మరింత బాగుంటాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!