కేసీఆర్..8 రోజులకే దివాళా తీయించావా..?

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల కోతపైన ఎం.పి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రమని చెపుతున్న కేసీఆర్ కేవలం ఎనిమిది రోజుల లాక్ డౌన్ కే చేతులెత్తేశారని ఆయన ధ్వజమెత్తారు. పెద్ద పెద్ద మాటలు చెపుతున్న చంద్రశేఖర్ రావు ఉద్యోగుల పొట్టకొట్టడం మంచి పద్దతి కాదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు. తక్షణమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేత పత్రం విడుదల చేయాలని కోమటిరెడ్డి ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఇంత కాలం పాటు ధనిక రాష్ట్రమని చెప్పిన చంద్రశేఖర్ రావు ఇప్పుడు ఆర్థిక లోటు ఉందని చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రైవేటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిందేనని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల శాలరీల్లో కోతవేయడమేమిటని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ బాటలోనే ప్రైవేటు యాజమాన్యాలు వ్యవహరిస్తే జనం పరిస్థితి ఏమిటని ఆయన అన్నారు. పింఛన్ తో జీవితాన్ని గడిపే రిటైర్ట్ ఉద్యోగుల పొట్ట కొట్టడం న్యాయం కాదని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాళ్లను కేసీఆర్ రోడ్డున పడేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణ లేకుండా వ్యవహారించి అప్పుల పాలు చేశారని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు కరోనా కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీతాల కోతను వెనక్కి తీసుకోవాలని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ప్రతి వారం శ్వేతపత్రం ప్రకటించాలని ముఖ్యమంత్రిని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.



Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!