వస్తున్న…కాచుకో

మల్కాజ్ గిరి ఎం.పి,కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కసి మీదున్నారు. తన ప్రత్యర్థులను మాటల తూటాలతో చీల్చి చెండాడటానికి ఆయన సిద్ధమౌతున్నారు. కక్ష సాధింపు చర్యలకు దిగిన తన వ్యతిరేకుల టాప్ లేపడానికి రేవంత్ రెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నారు. మాటల యుద్ధంతో శత్రువు మతిపొగొట్టడానికి స్కిప్టు తయారు చేసుకుంటున్నారు. గట్టుమట్టులను రట్టు చేసి రచ్చ రచ్చ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. తనను జైలు పాలు చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారి ఆట కట్టించాలని రేవంత్ రెడ్డి రగిలిపోతున్నారు. కబ్జారెడ్డి అంటు కథనాలు వండివారుస్తున్న వారిపైన వార్ చేయడానికి ఆయన ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు.

డ్రోన్ కెమెరా కేసులో జైలులో ఉన్న రేవంత్ రెడ్డి మంచి ఊపులో ఉన్నారట. కసితో రగిలిపోతున్నారట. మాటల కత్తులకు మాంచి పదును పెడుతున్నారని సమాచారం. కుట్రదారుల సంగతి తేల్చుతానని ములాఖత్ కు వెళ్లిన సన్నిహితుల వద్ద రేవంత్ రెడ్డి గర్జిస్తున్నారట. తనను ముట్టుకుంటే తేనే తుట్టను కదలపడమేనని ఆయన చెపుతున్నారని సమాచారం. ఆటా, వేటా ఇక ముందు మొదలవుతుందని రేవంత్ రెడ్డి అంటున్న మాటలు విని నాయకులు ముక్కున వేలేసుకుంటున్నారని తెలుస్తోంది. జైలులో ఉన్నప్పటికి రేవంత్ ఆత్మవిశ్వాసం ఇసుమంతైనా తగ్గకపోవడం వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోందట. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తానని, తనతో గోకున్న వారికి శంకరగిరి మాన్యాలేనని రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారని చెపుతున్నారు. ఇక ముందు తాను పదే పదే జైలుకు రావాల్సి వస్తుందని, అందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నానని ఆయన అంటున్నారని సమాచారం. తనపైన పెట్టిన పాత కేసుల దుమ్ముదులిపి ఏదో రకంగా జైలుకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి చెపుతున్నారని తెలుస్తోంది. అయినప్పటికి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన తెల్చి చెపుతున్నారట. ఆర్థికంగా తనను ఎంత దెబ్బతీసినప్పటికి ప్రత్యర్థులను మాత్రం వదలబోనన్న విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి స్పీచ్ ఉండాలన్న దానిపైన రేవంత్ కసరత్తు చేస్తున్నారని సన్నిహితులు చెపుతున్నారు. నోటుకు ఓటు కేసులో బెయిల్ పైన బయటకు వచ్చిన రోజు ఆయన చేసిన ప్రసంగం ఊర్రూతలూగించింది. మీసం తిప్పి మరీ సవాల్ చేయడం రేవంత్ రెడ్డికి సూపర్ క్రేజ్ తెచ్చి పెట్టింది. ఈ సారి కూడా కేసీఆర్ తో పాటు ఒక ప్రముఖ వ్యాపారి, ఆయనకు చెందిన మీడియా ఛానెల్ ను తూర్పారపట్టబోతున్నట్లు సన్నిహితులు చెపుతున్నారు.

ఇదే సమయంలో సొంత పార్టీలోని కొంత మంది నాయకుల తీరుపైన కూడా రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం తనను అణిచివేస్తుంటే కొందరు కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండటాన్ని రేవంత్ రెడ్డి సహించలేకపోతున్నారు.ఇలాంటి వారికి సరైన సమాధానం చెప్పాలని ఆయన భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నాయకుల వైఖరీని ఇప్పుడు ప్రశ్నిస్తే అసలు విషయం దారి తప్పే అవకాశం ఉండటంతో దీనికి కొంత సమయాన్ని తీసుకునే ఛాన్స్ ఉంది. పీసీసీ ఛీప్ ఎవరన్నది ఖరారైన తర్వాత కాంగ్రెైస్ అంతర్గత శత్రువులపైకి రేవంత్ రెడ్డి దండెత్తనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ లో ఎవరు మిత్రులు, ఎవరు శత్రవులు అన్న విషయం ఆయనకు తేటతెల్లం అయింది. వీరిలో కొందరు కేసీఆర్ కోవర్టులున్నారని రేవంత్ రెడ్డి అనుమానిస్తున్నారు. వీరేవ్వరిని సహించోనని సన్నిహితుల దగ్గర చెపుతున్నారట.

మొత్తానికి రేవంత్ రెడ్డి జైలు నుంచి బయటకు వస్తే తెలంగాణ రాజకీయం మాటల తూటాలతో మోగిపోవడం ఖాయం. అయితే ఈ సారి మాటల మోత ఆటంబాంబుల స్థాయికి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!