వైసీపీలోకి రామసుబ్బారెడ్డి

ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి వరస కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నలుగురు ఎం.పిలతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ నుంచి ఫిరాయించారు. ముఖ్యనేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. తెలుగుదేశంలోని కీలక నేతలకు వైసీపీ వల విసరుతోంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ శ్రేణులను తమ వైపు తిప్పుకునే పనిలో అధికార పార్టీ బిజీగా ఉంది.లోకల్ బాడీ ఎన్నికల్లో తిరుగులేని విజయాలను నమోదు చేయాలని ఆరాటపడుతున్న జగన్ ఇందుకోసం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా తన జిల్లాలో బలాన్ని మరింత పెంచుకోవడం కోసం టీడీపీ నేతలకు జగన్ గాలం వేస్తున్నారు. జిల్లాలో తెలుగుదేశం ఉనికిని దెబ్బతీయాలన్న పట్టుదలతో ఉన్న ఆయన తెలుగుదేశం నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పులివెందుల టీడీపీ ఇంఛార్జీ సతీష్ రెడ్డి ని వైసీపీలో చేర్చుకోవడానికి రంగం సిద్ధమైంది. ఆయన ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ కండువా కప్పుకోవడం లాంఛనమేనన్న వార్తలు వస్తున్నాయి. సతీష్ రెడ్డి పార్టీ మారితే పులివెందులలో టీడీపీ కథ ముగిసినట్లే. ఇక జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడం ఖాయమైంది. పార్టీలో చేరాలని జగన్ ఆయనను ఆహ్వానించారు. తన వర్గంతో సమావేశమైన రామసుబ్బారెడ్డి అధికార పార్టీలో చేరడానికి రెఢీ అయ్యారు. రామసుబ్బారెడ్డి పార్టీ మారితే జమ్మలమడుగులో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోయారు. దీంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉనికి పోయినట్లే అవుతుంది. బద్ద శత్రువులైన రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలను పార్టీలో ఐక్యంగా ఉంచడానికి చంద్రబాబు నానా పాట్లు పడ్డారు. గత ఎన్నికల్లో కడప లోక్ సభ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి రామసుబ్బారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరడంతో రామసుబ్బారెడ్డి తెలుగుదేశంలో కొనసాగుతారని భావించారు. కాని ఇప్పుడు ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెఢీ కావడం విశేషం. జమ్మలమడుగు నుంచి వైసీపీ తరుపున సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.ఆయనకు రామసుబ్బారెడ్డికి మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ సమయంంలో రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరితే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ఛాన్స్ ఉంది. మరి జగన్ వీరిద్దరి మధ్య ఎలా సఖ్యత కల్పిస్తారో చూడాలి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!