500 కోట్లు..ఓ పెళ్లి

దేశంలో మరో అత్యంత ఖరీదైన వివాహం జరగబోతోంది. కళ్లు చెదిరేలా పెళ్లి వేడుకలకు రంగం సిద్ధమైంది. వంద కోట్ల ఖర్చుతో భారీ హంగు ఆర్భాటాలతో జరగబోయే ఈ మ్యారేజ్ కు బెంగళూరు వేదిక కాబోతోంది. కర్ణాటక మంత్రి, బీజేపీ నేత శ్రీరాములు కూతురు పెళ్లి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన గురువు గాలి జనార్దన్ రెడ్డిని మించి శ్రీరాములు తన ఇంట్లో పెళ్లి ఖర్చు చేస్తున్నారు. వందల కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తున్నట్లు హంగు ఆర్భాటం చూస్తే ఇట్లే అర్థమౌతోంది. గత గారాల పట్టి రక్షిత వివాహం కోసం మంత్రి శ్రీరాములు ఎక్కడా తగ్గడం లేదు. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు కుమార్తె పెళ్లి ఈ నెల 5న బెంగళూరులో జరగబోతోంది. ఇందు కోసం గత పదిహేను రోజులుగా బ్రహ్మండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్ లో పెళ్లి మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. సుమారు 40 ఎకరాల్లో మ్యారేజ్ కోసం ఏర్పాట్లు జరుగుతుండటం విశేషం. విరూపాక్ష దేవాలయం ఆకారంలో మండపాన్ని నిర్మించడానికి 300 మంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఇక కళ్యాణ వేదిక విశిష్ట మెల్కొటే గుడిలోని కళ్యాణి తరహాలో ఉంటుంది. పెళ్లికి రావాల్సిందిగా లక్ష ఆహ్వానపత్రికలను దేశ విదేశాల్లో అందజేశారని సమాచారం. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను శ్రీరాములు స్వయంగా ఆహ్వానించారు. ఎపీ సి.ఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఆయన స్వయంగా అమరావతికి వచ్చి పెళ్లి పత్రిక అందజేశారు.

మరో వైపు పెళ్లి కూతురు రక్షిత మేకప్ కోసం ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొనే టీంను పిలిపిస్తున్నారు. పెళ్లి కూతురి డ్రస్ డిజైన్ బాధ్యతలను ప్రముఖ కన్నడ సినిమా కస్ట్యూమ్ డిజైనర్ సానియాకు అప్పగించారు. మరో వైపు నార్త్ కర్ణాటక స్టైల్ భోజనాలను పెళ్లిలో వడ్డించనున్నారు. ఇందు కోసం 1000మంది వంట మాస్టార్లు గరిట తిప్పబోతున్నారట. పెళ్లి వేడుకలకు దేశ విదేశాల నుంచి హాజరవుతున్న ప్రముఖలకు శ్రీరాములు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. ఇందు కోసం బెంగళూరులోని అన్ని స్టార్ హోటళ్లను బుక్ చేశారట.

ఇదే సమయంలో బళ్ళారిలో రిసెప్షన్ జరగబోతోంది. అక్కడ కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీవుడ్ స్టైల్ లో వేదికను రూపొందించడానికి 200 మంది శ్రమిస్తున్నారు. వందల క్వింటాళ్ల పూలను రిసెప్షన్ వేదిక అలంకరణ కోసం వాడుతున్నారు. శ్రీరాములు తన సొంత జిల్లా బళ్ళారి ప్రజలందరిని రిసెప్షన్ కు ఆహ్వానించారు. అయితే శ్రీరాములుకు కాబోయో అల్లుడు హైదరాబాద్ కు చెందిన వాడు కావడం విశేషం. ఈ పెళ్లి కోసం శ్రీరాములు 500 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు కర్ణాటక లో ప్రచారం జరుగుతోంది.

కర్ణాటక వివాదస్పదన నాయకుల్లో శ్రీరాములు ఒకరు. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడు. గతంలో బీజేపీతో విభేదించి శ్రీరాములు కొత్త పార్టీ పెట్టుకున్నారు. అయితే యడ్యూరప్ప తిరిగి బీజేపీలో చేరడంతో శ్రీరాములు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!