రేవంత్ రెడ్డి పీసీసీపైన కేసీఆర్ కన్ను..?

రేవంత్ రెడ్డిపైన కేసీఆర్ సర్కార్ కన్నేసింది. ఆయనే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.ఆర్థికంగా ఆయన మూలాలను కదిలించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. చెవిలో జోరీగలా తయారైన రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కోసం అన్ని అస్త్రాలను టీఆర్ఎస్ సర్కార్ ప్రయోగిస్తోంది. పీసీసీ ఛీప్ ఎంపిక జరగబోతున్న సమయంలో మరో సారి కేసీఆర్ ద్రుష్టి రేవంత్ రెడ్డి మీద పడింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షరేసులో రేవంత్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్గీ కేడర్ బలంగా కోరుతోంది. రేవంత్ రెడ్డి పీసీసీ ఛీప్ అయితే కేసీఆర్ కు మరిన్ని చికాకులు ఖాయం. ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇబ్బంది పెడతారనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అందుకే రేవంత్ రెడ్డి పీసీసీ ఛీప్ అవకాశాలను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వాతావరణం కనిపిస్తోంది. తాజాగా రేవంత్ రెడ్డి భూములకు సంబంధించిన వ్యవహరాన్ని బయటకు లాగిన తీరే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డికి సంబంధించిన భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గోపనపల్లి లో రేవంత్ రెడ్డికి చెందిన భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేశారంటు డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి తహసీల్దార్ గా పనిచేసిన సమయంలో శ్రీనివాస్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రభుత్వ వాదన. గోపన్ పల్లి గ్రామ సర్వే నెంబర్ 127లోని 5.06 ఎకరాల భూమికి సంబంధించి 2015లో మ్యుటేషన్ ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. అయితే అక్రమంగా మ్యుటేషన్ కు తాహసీల్దార్ పాల్పడ్డారని అప్పట్లోనే విజిలెన్స్ విచారణ జరిపారు. కలెక్టర్ సూచనల మేరకు ఇప్పుడు ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ పైన చర్యలు తీసుకుంది. గతంలో కూడా ఈ భూమికి సంబంధించి కొందరు తమను రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి బెదిరించారంటు మీడియా ముందుకు వచ్చారు. ఆ తర్వాత వారెటు పోయారో తెలియదు.

అయితే రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వ చర్యలను కక్ష సాధింపులో భాగమేనని అంటున్నారు. గత కొన్నాళ్ల నుంచి తనపైన వివిధ రకాలు వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శిస్తున్నారు. మ్యుటేషన్ అన్నది ప్రైవేటు వ్యవహారమని, దాంతో ప్రభుత్వానికి ఏం సంబంధమన్నది రేవంత్ రెడ్డి ప్రశ్న. తనను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఏదో ఒక అంశాన్ని కేసీఆర్ ముందుకు తెస్తున్నారని ఆయన అంటున్నారు. వీటికి భయపడే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ తప్పులను వెంటాడుతున్నానని అందుకే తనపైన ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన అంటున్నారు. గులాబీ కూలీ కేసులు, జూపల్లి రామేశ్వరరావుకు భూ కేటాయింపులతో పాటు కేటీఆర్ కు అక్రమాస్తులను బయటకు తెస్తున్నానన్న అక్కసు కేసీఆర్ లో కనిపిస్తోందంటున్నారు. మరో వైపు పట్నం గోస పేరుతో తాను చేస్తున్న కార్యక్రమాన్ని కేటీఆర్ సహించలేకపోతున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.

మొత్తానికి రేవంత్ రెడ్డిని కట్టడి చేయడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.పీసీసీ ఛీప్ హోదా దక్కకుండా చేయడమే చంద్రశేఖర్ రావు ప్రధాన ఆలోచనగా రేవంత్ రెడ్డి వర్గం అనుమానిస్తోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వ్యవహారాల్లో చక్రం తిప్పిన ముఖ్య నేత ద్వారా కేసీఆర్ కథనడిపిస్తున్నారని వారంటున్నారు. పీసీసీ దక్కకుండా ఢిల్లీలో కూడా లాబీయింగ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి వర్గం వాదిస్తోంది. రేవంత్ భూముల అంశాన్ని కాంగ్రెస్ నేతల ద్వారా అధిష్టానం దగ్గరకు తీసుకెళ్లి పీసీసీ రేస్ నుంచి తప్పించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని వారంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయాలను అంత సీరియస్ గా తీసుకోకవడం విశేషం.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!