బొత్స చెప్పాడు.. ఇక అయినట్లే

మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు సరిగా అర్థం కావు కాని.. ఇటీవల ఆయన చెప్పింది మాత్రం నిజమౌతోంది. తనదైన యాస, భాషతో మీడియాను, జనాన్ని చెవులు రిక్కరించుకునేలా చేసే సత్తిబాబు ఈ మధ్య ముందుగానే సత్యాలు చెపుతున్నారు. జరిగింది చెపుతా, జరగబోయేది చెపుతా అంటు బొత్స చెపుతున్న సోది కొన్నాళ్లకు నిజమై కూర్చుంటుంది. నీ మాట శాసనం సామి అని ఏదో సినిమా డైలాగ్ మాదిరిగా సత్తిబాబు నోటి నుంచి వచ్చే పలుకులు భవిష్యత్తు సూచకలుగా మారాయి. అవును బొత్య సత్యనారాయణ జగన్ సర్కార్ కు మౌత్ పీస్ లా తయారయ్యారు. విధాన పరమైన నిర్ణయాలను నెమ్మదిగా లీక్ చేయడంలో సత్తిబాబు ముందుంటున్నారు. జగన్ కు నమ్మిన బంటులు అనేక మంది ఉన్నప్పటికి ఆయన మాత్రం బొత్స సత్యనారాయణను ముందు పెట్టి గేమ్ ప్లే చేస్తున్నారు. అమరావతి విషయంలో సత్తిబాబు గత కొన్నాళ్ల నుంచి చెపుతున్న మాటలు నిజాలయ్యాయి. రాజధాని మార్పుపైన ఆయన అందరి కంటే ముందుగానే సంకేతాలిచ్చారు. అమరావతిని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకున్నారు ఆయన. ఒక పథకం ప్రకారం బొత్స రాజధాని అంశాన్ని రచ్చ రచ్చ చేశారు. అమరావతా .. హైమావతా అంటు ఆయన వేసిన వ్యంగ్యబాణాలు, రైతుల గురించి చేసిన కామెంట్లు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్నే రేపాయి. అయితే బొత్స మాట్లాడిన ప్రతి మాట ఆ తర్వాత నిజమైంది. ముందస్తు వ్యూహాంలో బాగంగానే అమరావతి సినిమాలో సత్తిబాబుతో ఓపెనింగ్ సీన్స్ చిత్రీకరించి చివరకు జగన్ శుభం కార్డు చేశారు. ఆ వివాదం కొనసాగుతుండగానే బొత్స సత్యనారాయణ అత్యంత కీలకమైన మరో అంశాన్ని కదిలించారు.

బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో చేరే అంశంపైన సత్తిబాబు తాజాగా సంకేతాలిచ్చారు. మోదీ నాయకత్వంలో పనిచేయడానికి తాము సిద్ధమేనని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీ తమకు దూరం కాదని సెలవిచ్చారు. ఒక పక్క ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన సందర్బంలోనే బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీఎలో చేరతామని ఆయన తేల్చి చెప్పడం విశేషం. ఎవరి గడ్డమైనా పట్టుకొని బతిమాలే స్థాయి కూడా వెళ్తామని బొత్సా అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ ఎందుకు పడ్డాలని సత్తిబాబు ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో కలిసిలేమని, అలాగే దూరం కూడా లేమని ఆయన సినిమా డైలాగ్ వదిలారు. నిజానికి కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ చేరే అంశం మీద జగన్ , విజయసాయి రెడ్డి కాకుండా మాట్లాడే ధైర్యం ఎవరూ చేయరు. కాని బొత్స మాత్రం అలవోకగా విషయాన్ని విడమర్చి చెప్పేశారు. దీంతో బీజేపీ, వైసీపీ సంబంధాల మీద గత కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్న వార్తల్లో కొంత పస ఉందని తేలిపోయింది. అన్నీ కుదిరితే వచ్చే నెలలోనే మోదీ ప్రభుత్వంలో వైసీపీ చేరే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు కేంద్ర మంత్రులు కూడా ఆ పార్టీకి రాబోతున్నాయట. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పాటు మరో బీసీ లేదా ఎస్సీ ఎం.పికి అమాత్య యోగం పట్టబోతుందని వైసీపీ వర్గాలు చెపుతున్నాయి.

ఇదే జరిగితే ఇంత కాలం ఇంతకాలం రాష్ట్రంలో వైసీపీ సర్కార్ మీద ఎగిరెగిరి పడిన బీజేపీ నేతల పరిస్థితి ఏమిటీ..? ఆ పార్టీ తో జతకట్టిన పవన్ కళ్యాణ్ ఎటు పోతారు…? ఇలా అనేక ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. మొత్తానికి బొత్స సత్తి బాబు చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాఫిక్ కు మరింత టానిక్ ను ఇచ్చాయి. ఆయన మాటలు ఈ సారి కూడా నిజమైతే ఆంధ్రా ఆక్టోపస్ గా లగడపాటి రాజగోపాల్ కు ఉన్న బిరుదును బొత్సాకు బదిలీ చేయాలేమో…?

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!