తెలంగాణ బీజేపీలో జూపల్లి రామేశ్వరరావు చిచ్చు …?

తెలంగాణ బీజేపీలో ముఖ్య నాయకుల మధ్య విభేదాలు తీవ్రమౌతున్నాయి. కీలక నేతలే పార్టీ అధిష్టానానికి ఒకరి పైన మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక ఉన్న నేపథ్యంలో వివాదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా పార్టీలో కీలక స్థానాల్లో ఉంటు టీఆర్ఎస్ తో కుమ్మక్కవుతున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు కల్గిన వాళ్లతో పార్టీ నాయకులు రాసుకుపూసుకు తిరగడంపైన కాషాయ పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. ప్రధానంగా పార్టీ కీలక నేత, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీరు పైన పలువురు నేతలు రగిలిపోతున్నారు. ఆయన మీద పార్టీ అధ్యక్షుడితో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వరరావుతో కిషన్ రెడ్డి సన్నిహిత సంబంధాలు నేరపడంపైన అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల రామేశ్వరరావు, ఆయన కుమారుడిని కిషన్ రెడ్డి స్వయంగా కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి ప్లహాద్ జోషి వద్దకు తీసుకెళ్లారు. పార్లమెంటు జరుగుతున్న సమయంలో ఆ సంఘటన జరిగింది. తన సిమెంటు కంపెనీ అనుమతుల కోసం రామేశ్వరరావు కేంద్రమంత్రిని కలిసినట్లు సమాచారం. అయితే కిషన్ రెడ్డి స్వయంగా రామేశ్వరరావు, ఆయన కుమారుడిని వెంటబెట్టుకొని కేంద్ర మంత్రిని కలిపించడం ఇప్పుడు బీజేపీలో చర్చకు దారితీసింది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు అత్యంత సన్నిహితుడైన రామేశ్వరరావుకు కిషన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడంపైన కాషాయ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. కేసీఆర్ కు అన్ని విధాలుగా అండగా నిలబడుతున్న జూపల్లి కి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారని వారు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పైన బీజేపీ శ్రేణులు పోరాడుతుంటే కిషన్ రెడ్డి ఇలాంటి పనులు చేస్తే ఎలా అన్నది వారి ప్రశ్న. టీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి చర్యలను వారు తప్పపడుతున్నారు. రామేశ్వరరావు, కిషన్ రెడ్డి వ్యవహారంపైన నిజామాబాద్ ఎం.పి అర్వింద్ తీవ్ర మండిపడుతున్నట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో కేసీఆర్ పైన తీవ్రంగా పోరాడుతుంటే కిషన్ రెడ్డి లోపాయికారీ వ్యవహారాలు చేయడమేమిటని ఆయన ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉన్న జూపల్లి రామేశ్వరరావుకు కిషన్ రెడ్డి సాయం చేయడాన్ని అర్వింద్ గట్టిగా వ్యతిరేకించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రధాని మోదీతో పాటు అమిత్ షాకు కిషన్ రెడ్డి మీద అర్వింద్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి, జూపల్లి రామేశ్వరరావు, ప్రహ్లాద్ జోషి కలిసి ఉన్న ఫోటోను కూడా వారికి అందజేసినట్లు సమాచారం. దీనిపైన ప్రధాని, అమిత్ షా కూడా ఆగ్రహంగా ఉన్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. కిషన్ రెడ్డి నుంచి పార్టీ కార్యాలయం వివరణ తీసుకుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎం.పి అర్వింద్ కు సంబంధించిన ఫేస్ బుక్ పేజీల్లో జూపల్లి, కిషన్ రెడ్డి వ్యవహారంపైన గట్టిగా కథనాలు వస్తుండటం విశేషం. అర్వింద్ ఇప్పటి వరకు బహిరంగంగా దీని మీద వ్యాఖ్యానించనప్పటికి సన్నిహితుల దగ్గర తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీలో జూపల్లి రామేశ్వరరావు పెట్టిన చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇది ఎటు నుంచి ఎటు వైపునకు దారితీస్తుందో చూడండి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!