రేవంత్ రెడ్డి రెండేళ్లు ఆగాల్సిందే….?

కాంగ్రెస్ తెలంగాణ ఛీప్ పైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం మీద పార్టీ అధిష్టానం నెలల తరబడి నుంచి కసరత్తు కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను రిలీవ్ చేయాలని కోరుతున్నప్పటికి హైకమాండ్ మాత్రం నాన్చుడు ధోరణిని అవలంభిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొని రావడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డినే మరో రెండు నెలల పాటు గాంధీ భవన్ కుర్చీలో కూర్చోవాల్సి ఉంది. మరో వైపు కొత్త బాస్ కోసం అధిష్టానం అన్వేషణ చేస్తోంది. ఉత్తమ్ వారసుడి కోసం ఢిల్లీ పెద్దలు ఆరా తీస్తున్నారు. పలువురు పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. కొందరు నాయకులు తమ సేవలను గుర్తించాలని హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. త్వరలోనే తెలంగాణకు పార్టీ అధిష్టానం దూతలు వచ్చి అభిప్రాయ సేకరణ నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పటి వరకు పీసీసీ ఛీప్ రేస్ లో మల్కాజ్ గిరి ఎం.పి రేవంత్ రెడ్డి ముందున్నారు. ఆయనకే గాంధీ భవన్ పగ్గాలు అప్పగించడం ఖాయమన్న రీతిలో ప్రచారం జరిగింది. అయితే పార్టీ సీనియర్లకు మాత్రం రేవంత్ రెడ్డి కింద పనిచేయడం ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే అధిష్టానం వద్ద ఆయన పైన కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు చేశారు. బీజేపీకి సన్నిహితుడంటు కొందరు పార్టీ పెద్దలకు వివరించినట్లు సమాచారం. దీంతో పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి పేరును తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. పార్టీ కోసం మరికొంత కాలం పనిచేసిన తర్వాత ఆయన పేరును పరిశీలించవచ్చునన్న అభిప్రాయానికి హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఇప్పుడు పీసీసీ రేస్ లో ముందున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. ఉత్తమ్, భట్టితో పాటు మరికొందరు సీనియర్లు శ్రీధర్ బాబు వైపు మొగ్గు చూపిస్తున్నారు. శ్రీధర్ బాబు కాకుంటే బీసీ నేతను పీసీసీ ఛీప్ చేయాలన్న ఆలోచన కూడా వారిలో ఉన్నట్లు సమాచారం. రెడ్డి సామాజికవర్గానికే అధ్యక్ష పదవి ఇవ్వాలని భావిస్తే కోమటిరెడ్డి పేరును పరిశీలించవచ్చు. మొత్తానికి రేవంత్ రెడ్డి మాత్రం పీసీసీ ఛీప్ పదవి కోసం మరో రెండేళ్లు ఎదురు చూడలని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!