హుజూర్ న‌గ‌ర్ బ‌రిలో రేవంత్ రెడ్డి…(స్నేహితుడి కోసం)

పీసీసీ ఛీప్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌న శాస‌న‌స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు.న‌ల్గొండ ఎం.పిగా విజ‌యం సాధించ‌డంతో హుజూర్ న‌గ‌ర్ ఎమ్మెల్యే స్థానాన్ని ఆయ‌న ఖాళీ చేయాల్సి వ‌చ్చింది. దీంతో త్వ‌ర‌లోనే ఇక్క‌డ ఉప ఎన్నిక రాబోతోంది. అయితే ఇక్క‌డి నుంచి కాంగ్రెస్ త‌రుపున ఎవ‌రు బ‌రిలోకి దిగుతార‌న్న దానిపైన ఉత్కంఠ నెల‌కొన్న‌ది. హుజూర్ న‌గ‌ర్ నుంచి త‌న భార్య పద్మావ‌తి పోటీకి విముఖ‌త చూపిస్తున్నార‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తాజాగా స్ప‌ష్టం చేశారు. దీంతో ఎవ‌రు పోటీ చేస్తార‌న్న దాని మీద కాంగ్రెస్ కేడ‌ర్ ఆస‌క్తి చూస్తోంది. నిజానికి ఇక్క‌డ ఉత్త‌మ్ కుటుంబ స‌భ్యులైతేనే గెలుపున‌కు ఎక్కువ అవ‌కాశాలున్నాయి. అయితే ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పూర్తి స‌హ‌క‌రిస్తే పార్టీ అభ్య‌ర్థి విజ‌యం అసాధ్యం కాక‌పోవ‌చ్చు. దీంతో కాంగ్రెస్ నుంచి పలువురు ఆశావాహులు పోటీకి సిద్ధ‌మౌతున్నారు. ప్ర‌ధానంగా సూర్యాపేట‌కు చెందిన ప‌టేల్ ర‌మేష్ రెడ్డి హుజూర్ న‌గ‌ర్ టిక్కెట్ ఆశిస్తున్నారు. సూర్యాపేట‌లో బ‌లమైన నాయ‌కుడిగా ర‌మేష్ రెడ్డి ఎదిగారు. తెలుగుదేశం పార్టీ త‌రుపున ఆయ‌న గ‌తంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి గ‌ట్టి పోటీనిచ్చారు. రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ లో చేరిన ర‌మేష్ రెడ్డి 2018లో సూర్యాపేట టిక్కెట్ ఆశించారు. కాని సీనియ‌ర్ నేత రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డికి అధిష్టానం టిక్కెట్ కేటాయించింది. అయితే రాంరెడ్డికి టిక్కెట్ ఇచ్చే స‌మ‌యంలో న‌ల్గొండ లోక్ స‌భ స్థానాన్ని ర‌మేష్ రెడ్డికి ఇస్తామ‌ని హైక‌మాండ్ పెద్ద‌లు హామీ ఇచ్చారు. కాని మారిన ప‌రిస్థితుల్లో న‌ల్గొండ నుంచి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స్వ‌యంగా పోటీ చేసి విజ‌యం సాధించారు. దీంతో త‌న‌కు హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో పోటీచేసే అవ‌కాశం ఇవ్వాల‌ని ర‌మేష్ రెడ్డి కోరుతున్నారు. అధిష్టానం టిక్కెట్ ఇస్తే క‌చ్చితంగా గెలుస్తాన‌న్న న‌మ్మ‌కాన్ని ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి తాను అత్యంత స‌న్నిహితుడిని కావ‌డం కూడా క‌లిసి వ‌స్తుంద‌న్న భావ‌న‌లో ర‌మేష్ రెడ్డి ఉన్నారు. నిజానికి హుజూర్ న‌గ‌ర్ ప్రాంతంలో రేవంత్ రెడ్డికి విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. వేల సంఖ్య‌లో ఆయ‌న‌కు అభిమానులున్నారు. కాంగ్రెస్ తో పాటు టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లో రేవంత్ కు వీరాభిమానులున్నారు. హుజూర్ న‌గ‌ర్ లో రెడ్డి సామాజిక వ‌ర్గం బ‌లం ఎక్కువ‌. పార్టీల‌కు అతీతంగా వీరు రేవంత్ రెడ్డి మీద అభిమానం చూపిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో రేవంత్ రెడ్డే ప్ర‌ధాన ఆయుధంగా తాను బ‌రిలోకి దిగుతానని ప‌టేల్ ర‌మేష్ రెడ్డి చెపుతున్నారు. తాను పోటీ చేస్తే త‌న కోసం క‌నీసం ప‌ది రోజులు రేవంత్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేస్తార‌ని ఆయ‌న అంటున్నారు. ఉత్త‌మ్ స‌హ‌కారం, పార్టీ బ‌లానికి రేవంత్ అభిమానం కూడా క‌లిస్తే కాంగ్రెస్ సుల‌భంగా గెలుస్తుంద‌న్న‌ది ప‌టేల్ ర‌మేష్ రెడ్డి అంచ‌నా.

మ‌రో వైపు త‌న‌తో పాటు కాంగ్రెస్ లో చేరి, టిక్కెట్ రాక‌పోయినప్ప‌టికి విధేయ‌త చూపించిన రమేష్ రెడ్డిని గెలిపించుకోవడానికి రేవంత్ రెడ్డి క‌చ్చితంగా క‌ష్ట‌ప‌డ‌నున్నారు. అన్ని విధాలుగా అండ‌గా ఉంటాన‌న్న సంకేతాల‌ను ఆయ‌న ఇప్ప‌టికే ఇచ్చిన‌ట్లు చెపుతున్నారు. అయితే రేవంత్ రెడ్డికి స‌న్నిహితుడైన ర‌మేష్ రెడ్డికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి టిక్కెట్ రానిస్తారా అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌. ఒక వేళ అధిష్టానం అవ‌కాశం ఇచ్చినా ఉత్త‌మ్ స‌హ‌క‌రిస్తారా అనేది కూడా అనుమానాస్ప‌ద‌మే. పీసీసీ ఛీప్ ప‌ద‌వి నుంచి దిగిపోవాల‌ని ఆరాట‌పడుతున్న ఆయ‌న హుజూర్ న‌గ‌ర్ లో కాంగ్రెస్ గెలుపును అంత సీరియ‌స్ గా తీసుకునే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. మొత్తానికి హుజూర్ న‌గ‌ర్ బ‌రిలో రేవంత్ రెడ్డి త‌న స్నేహితుడి కోసం దూకితే ప‌రిస్థితి ఏ ర‌కంగా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన అంశం.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!