రేవంత్ రెడ్డి ఎంట్రీ..ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో వణుకు

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని రాజ‌కీయంగా అణ‌దొక్క‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. త‌మ చెవిలో జోరీగ‌లా త‌యారైన ఆయ‌న‌ను చ‌ట్ట స‌భ‌ల్లోకి అడుగు పెట్ట‌నివ్వొద్ద‌ని కేసీఆర్ అన్ని వ్యూహాలు ప‌న్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కొడంగ‌ల్ లో గెల‌వ‌నివ్వ‌కుండా ఆయ‌న అన్ని స్కెచ్ లు గీశాడు. అయితే కొడంగ‌ల్ ఓట‌ర్ల‌పైన ఎక్కువ న‌మ్మ‌కం పెట్టుకున్న రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. దీంతో రేవంత్ ప‌ని అయిపోయింద‌నే ప్ర‌చారం ముమ్మ‌రమైంది. ఆయ‌న మీద పైచేయి సాధించిన‌ట్లుగా టీఆర్ఎస్ భావించింది. రేవంత్ రెడ్డి వ్య‌తిరేకులు సంబ‌ర‌ప‌డిపోయారు. కాని నాలుగు నెల‌లు గ‌డిచేస‌రికి ప‌రిస్థితి తారుమారైంది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయ‌న రాజ‌ధాని న‌డిబొడ్డున గెలిచి ఎం.పి అయ్యారు. మ‌ల్కాజ్ గిరి లోక్ స‌భ బ‌రిలోకి దిగి టీఆర్ఎస్ ను ఓడించి పార్ల‌మెంటులో అడుగుపెట్ట‌బోతున్నారు. దీంతో కేసీఆర్ స‌వాల్ కు రేవంత్ రెడ్డి ధీటైన జ‌వాబు ఇచ్చిన‌ట్లైంంది. ఇదే స‌మ‌యంలో రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్ స‌ర్కార్ తో అమీతుమీకి రెఢీ అవుతున్నారు. కేసీఆర్ పాల‌న‌ను తూర్పార‌ప‌ట్ట‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. మ‌రో వైపు మ‌ల్కాజ్ గిరి పార్లమెంటు ప‌రిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు రేవంత్ ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. ఇక్క‌డ 7 అసెంబ్లీ స్థాన‌ల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎం.పిగా రేవంత్ రెడ్డికి మ‌ల్కాజ్ గిరి ప‌రిధిలో ప్రోటోకాల్ ఉంటుంది. ప్ర‌తి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మానికి త‌ప్ప‌ని స‌రిగా ఆయ‌న‌ను ఆహ్వానించాల్సిందే. శంఖుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల్లో ఆయ‌న పేరు త‌ప్ప‌ని స‌రి. అధికారిక స‌భ‌లు, స‌మావేశాల్లో రేవంత్ రెడ్డి ఉండాల్సిందే. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు చికాకుగా త‌యారైంది. కొడంగ‌ల్ లో ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు రేవంత్ టీఆర్ఎస్ మంత్రుల‌కు చుక్క‌లు చూపించారు. అప్పుడు మంత్రులుగా ఉన్న జూప‌ల్లి క్రిష్ణారావు, ల‌క్ష్మారెడ్డి, మ‌హేంద‌ర్ రెడ్డి లు రేవంత్ దెబ్బ‌కు అల్లాడిపోయారు. శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల స‌మ‌యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య యుద్ధ‌మే జ‌రిగేది. మంత్రులు ఉన్న వేదిక‌పైన టీఆర్ఎస్ స‌ర్కార్ ను రేవంత్ రెడ్డి క‌డిగిపారేసేవాడు. ఇప్ప‌డు ఎం.పిగా కూడా రేవంత్ ఇలాంటి పాత్ర‌నే పోషించ‌బోతున్నాడు. అందుకే ఇక్క‌డి మంత్రులు,ఎమ్మెల్యేలకు రేవంత్ భ‌యం ప‌ట్టుకుంది. మంత్రి మ‌ల్లారెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ల‌కు ఆయ‌న చికాకు తెప్పించ‌బోతున్నారు. మాములుగానే వీరిని త‌న మాట‌ల‌తో ఆడుకున్న రేవంత్ రెడ్డి ఓకే వేదిక మీద ఉన్న‌ప్పుడు వ‌దిలిపెట్టే అవ‌కాశ‌మే లేదు. ఇక మ‌ల్కాజ్ గిరి ప‌రిధిలోని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గ‌తంలో టీడీపీకి చెందిన వారే. కూక‌ట్ ప‌ల్లి ఎమ్మెల్యే మాద‌వ‌రం క్రిష్ణారావు, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయ‌న్న‌, మ‌ల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు గ‌తంలో రేవంత్ రెడ్డి తో క‌లిసి ప‌నిచేశారు. ఎల్.బి.న‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిన్న మొన్న‌టి వ‌ర‌కు రేవంత్ తోనే ఉన్నారు. ప్రొటో కాల్ లో ఈ ఎమ్మెల్యేలు ఎం.పిగా ఉన్న రేవంత్ తో క‌లిసి ప‌నిచేయాలి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొంద‌రిపైన ఆయ‌న‌కు కోపం ఉంది. టీడీపీ లో ఉన్న‌ప్పుడు త‌న‌ను మోసం చేసి టీఆర్ఎస్ లో చేరార‌నే భావ‌న‌లో రేవంత్ ఉన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పైన రేవంత్ విరుచుకుప‌డ్డారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఎదుర్కొవ‌డం ఈ శాస‌న‌స‌భ్యుల‌కు క‌ష్టంగా మార‌బోతుంది. ఇక ప్ర‌తి సంద‌ర్భంలోనూ త‌ల‌ప‌డ‌క‌త‌ప్ప‌ద‌ని వీరు ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. మొత్తానికి మ‌ల్కాజ్ గిరిలో ఇక ప్రొటో కాల్ యుద్దం ర‌స‌వ‌త్తంగా ఉండ‌బోతుంద‌న్న మాట‌.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!