రేవంత్ రెడ్డి అసంత్రుప్తి …?

తెలంగాణలో  ఆయనో ఫైర్ బ్రాండ్. మాటల మాంత్రికుడు. ఈటెలు లాంటి మాటలతో ప్రత్యర్థిని చిత్తు చేయగల్గిన సత్తా ఉన్న నేత. సూటిగా స్పష్టంగా ఎలాంటి సుత్తి లేకుండా దంచి కొట్టగల్గిన నాయకుడు.  ఊకదంపుడు ఉపన్యాాసాలు కాకుండా ఉన్నది ఉన్నట్లుగా ఉతికి ఆరేసే నేత. పక్కాగా లెక్కలతో సహా ప్రత్యర్థి కి ముచ్చెమటలు పట్టించగల్గే దమ్మున్న నాయకుడు. కేవలం దశాబ్దం కాలంలోనే తెలుగు ప్రజల్లో ఎన లేని క్రేజ్ సంపాదించుకున్న నేత. తెలంగాణలో కేసీఆర్ ను ఢీ కొట్టగల్గిన నాయకుడు ఆయన ఒక్కరే అన్న పేరు సంపాదించుకున్నారు.  టీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా ఎలాంటి శషబిషలు లేకుండా నిలబడ్డారనే విశ్వసనీయత ఉన్న నాయకుడు. చంద్రశేఖర్ రావుకు ఎదురొడ్డి నిలబడటానికి తానున్న పార్టీ బలం సరిపోదన్న భావనతో జాతీయ పార్టీలోకి చేరాడు. అప్పటి నుంచి ఆయన గళం మూగబోయింది.రాకెట్ వేగంతో దూసుకుపోతున్న ఆయనకు  బ్రేక్ లు పడ్డాయి. ముందుకు వెళ్లనివ్వకుండా సొంత పార్టీ నాయకులే పగ్గాలు వేసి వెనక్కు లాగుతున్నారు. ఎట్టి పరిస్థితులోనూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలన్న ఆయన కసి పైన కాంగ్రెస్ పెద్దలే నీళ్లు పోస్తున్నారు. పార్టీ మాట కాదన లేక, జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక  ఆయన సతమతమౌతున్నారు. అవును కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రస్తుత పరిస్థితి ఇది. ఎప్పుడూ ఏదో ఒక సంచలన వార్తతో వార్తల్లో ఉండే రేవంత్ గత కొంత కాలంగా మౌనంగా ఉండిపోయారు. అడపాదడపా మీడియా సమావేశాలు తప్ప ఆయనకు పెద్దగా పని ఉండటం లేదు. బస్సు యాత్రలో క్రమంగా తప్పకుండా పాల్గొంటు కార్యకర్తలకు దగ్గరయ్యేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. అయితే సభలో రేవంత్ ముందుగా మాట్లాడితే కార్యకర్తలు వెళ్లిపోతుండటంతో చివర్లో ఆయనకు మైక్ ఇస్తున్నారు. డజన్ మంది నాయకులు మాట్లాడే సరికి సభకు హాజరైన వారిలో సగం మంది వెళ్లిపోతున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రసంగం పార్టీ కార్యకర్తలకు సరైన రీతిలో వెళ్లడం లేదు.

మరో వైపు తమ నియోజకవర్గాల్లో పర్యటనకు రావాలని రేవంత్ రెడ్డిని అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఆహ్వానిస్తున్నారు. రెండుమూడు సార్లు మంత్రులుగా పనిచేసిన నేతలు కూడా రేవంత్ ను తమ ప్రాంతానికి తీసుకెళ్లడానికి పోటీపడుతున్నారు. జనంలో ఆయనకున్న క్రేజ్ ను ఉపయోగించుకోవాలన్నది వారి ఆలోచన. రేవంత్ వస్తే నియోజకవర్గాల్లో ఊపు వస్తుందని పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఇటీవల వనపర్తిలో జరిగిన సభను వారు గుర్తు చేస్తున్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి స్వయంగా రేవంత్ రెడ్డిని ఆహ్వానించి బహిరంగ సభను ఏర్పాటు చేశారు. వనపర్తి చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో జనం ఈ సభకు హాజరుకావడం ప్రత్యర్థులకు షాక్ ఇచ్చింది. కాని రేవంత్ రెడ్డిని తమ నియోజకవర్గాలకు  తీసుకెళ్తే పీసీసీ ఛీప్ నుంచి అభ్యంతరాలు వస్తాయన్న ఆందోళనలో కాంగ్రెస్ నాయకులున్నారు. రేవంత్ విషయంలో పార్టీ నుంచే డైరెక్షన్ వస్తే బాగుంటుందని ఆ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇదే సమయంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర విషయంలో పీసీసీతో పాటు ఎఐసీసీ తీరు ఆయన అభిమానులకు చికాకు కల్గిస్తోంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాదయాత్ర  చేస్తున్నాడు. పార్టీ బలంగా ఉన్నప్పటికి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న పట్టదలతో జగన్ నడుస్తున్నాడు. కాని తెలంగాణ కాంగ్రెస్ కు మాత్రం ఆ ఆలోచనే లేదు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు పాదయాత్ర చేస్తే పార్టీ కి   మంచి ఊపు వచ్చేది .లేదా పార్టీ సీనియర్ నాయకులంతా ఉత్తమ్ నేత్రుత్వంలో నడిచినా కాంగ్రెస్ కు ఉపయోగపడేది. కాని ఎవరూ పాదయాత్ర చేయవద్దని నిర్ణయం తీసుకోవడం ఎవరి ప్రయోజనం కోసమో అర్థం కాని పరిస్థితి.

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి కీలక పదవి ఇస్తామన్న హామీ రాహుల్ గాంధీ నుంచి వచ్చింది. రేవంత్ సేవలను వినియోగించుకుంటామని రాహుల్ స్పష్టం చేశారు. దీంతో కచ్చితంగా  ఆయనకు కాంగ్రెస్ లో ముఖ్యమైన పదవి వస్తుందని అనుచరులు, అభిమానులు భావించారు. కాని నెలలు గడుస్తున్నప్పటికి పదవిపైన పార్టీ నాయకత్వం పెదవి విప్పడం లేదు.  దీంతో రేవంత్ రెడ్డికి గాంధీ భవన్ లో కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా లేకుండా పోయింది.  మరో యేడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పార్టీ అన్ని రకాలు ఉయోగించుకుంటే మేలు జరిగేది. కాని ఆయనను ఖాళీగా ఉంచడం ద్వారా పార్టీ కార్యకర్తలకు  ఏం సందేశం ఇస్తున్నారో తెలియని స్థితి.

పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పీసీసీ ముఖ్యనేతల వ్యవహార శైలితో రేవంత్ రెడ్డి అసంత్రుప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాహుల్ గాంధీని కలిసి పరిస్థితిని వివరించాలని ఆయన భావిస్తున్నట్లు సన్నిహితులు చెపుతున్నారు.  ఏ మాత్రం ప్రణాళిక లేకుండా పార్టీ నడుస్తున్న తీరును అధినేత వద్ద ప్రస్తావించాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి రేవంత్ రెడ్డి మౌనంపైన ఆయన అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో చర్చ తీవ్రమైంది. మరి రేవంత్ ఎప్పుడు పూర్తిలో రంగంలోకి దిగుతారో చూడాలి.

 

 

 

 

 

 

 

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!