అయ్యో ..రేవంత్ తొందరపడ్డావు

తెలంగాణ తెలుగుదేశంలో ఇప్పుడంతా రేవంత్ రెడ్డిపైనే చర్చ. ఆయన తొందర పడ్డారని ఒకరు, కాస్తా ఓపిక పట్టి ఉంటే బాగుండేదని మరికొందరు… ఇలా తెలుగు తమ్ముళ్లు ఆయన  గురించి మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కొంచెం ఆలోచించి ఉంటే తెలుగుదేశంలోనే కొనసాగే వారన్నది కొందరు సీనియర్ల వాదన. రాజకీయ సమీకరణాలను రేవంత్ రెడ్డి అంచనా వేయలేక తొందరపడి కాంగ్రెస్ లో చేరారని మరో నేత విశ్లేషణ. ఆయన ముందు చూపుతో వ్యవహారించి ఉంటే టీడీపీలోనే తన కోరిక నేరవేరేదన్నది తెలుగుదేశం కార్యకర్తల ఆలోచన. కాంగ్రెస్ తో పొత్తుపైన రేవంత్ రెడ్డి కొంచెం ఆచితూచి వ్యవహారించి ఉంటే బాగుండేదని పసుపు పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ తో పొత్తు అంశాన్ని తేల్చాలన్న డిమాండ్ తో తెలుగుదేశం పార్టీని రేవంత్ రెడ్డి వదిలిపెట్టారు. వెంటనే స్పష్టత ఇవ్వాలంటు ఆయన చేసిన డిమాండ్ అప్పట్లో టీడీపీలో కలకలం స్రుష్టించింది. అయితే పొత్తులపైన ఇప్పుడే మాట్లాడబోనని చంద్రబాబు తేల్చి చెప్పడంతో రేవంత్ రెడ్డి తన దారి తాను చూసుకుంటున్నారు. ఇది జరిగి ఆరునెలలు అయిందో లేదో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బీజేపీతో తెలుగుదేశం తెగతెంపులు చేసుకుంది. ఇప్పుడు మోదీ, చంద్రబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. ప్రధాని మోదీకి అహంకారానికి తగిన బుద్ది చెప్పాలన్న పట్టుదలతో బాబు ప్రణాళికలు రచిస్తున్నారు. భావసారుప్యత కల్గిన పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ఆయన సిద్ధమౌతున్నారు. ఇదే సమయంలో మోదీకి వ్యతిరేకంగా అవసరమైతే కాంగ్రెస్ కు చంద్రబాబు మద్దతునిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అధికారంలోకి వస్తే ఎపీకి ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ స్నేహాంపైన చర్చలు మొదలయ్యాయి. ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ లో కూడా కాంగ్రెస్,టీడీపీ కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సింది లేదని వారంటున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీతో టీడీపీ నేతలు టచ్‌ లోకి వెళ్లినట్లు కూడా ప్రచారం మొదలైంది. రెండు రాష్ట్రాల్లోని తెలుగుదేశం నాయకులు ఈ ఉహాగానాలను ఏమాత్రం తోసిపుచ్చడం లేదు. ప్రధానంగా తెలంగాణలోని టీడీపీ నేతలు మరింత ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే కనీసం ఇరవై సీట్లు డిమాండ్ చేయవచ్చునని వారు భావిస్తున్నారు. టీఆర్ఎస్ పైన కసిగా ఉన్న తమ కేడర్ కాంగ్రెస్ తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారన్నది వారి అంచనా. ఈ సమయంలోనే రేవంత్ రెడ్డిపైన టీటీడీపీలో చర్చ జరుగుతోంది. ఆయన తొందరపడి పార్టీని వీడకపోతే కింగ్ మేకర్ గా అవతరించే వాడని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. రేవంత్ రెడ్ది కోరిక మేరకు టీడీపీ , కాంగ్రెస్ పొత్తు మరింత బలంగా ఉండేదని, తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు కూడా దక్కేవని వారంటున్నారు. డజన్ మంది నాయకుల్లో ఒకడిగా కాకుండా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో స్టార్ క్యాంపైయినర్  అయ్యే వాడని వారు స్పష్టం చేస్తున్నారు. ఆయన తొందరపాటు చర్య వల్ల తెలుగుదేశం వీక్ కావడంతో పాటు రేవంత్ రెడ్డి కూడా నాయకత్వ ఛాన్స్ కోల్పోయారని నేతలు వాపోతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ నాయకుడిగా రేవంత్ టీడీపీ కండువా కప్పుకుంటే చూడాలని తెలుగు తమ్ముళ్లు ఆరాటపడుతున్నారు.మరి వారి కోరిక నేరవేరుతుందో లేదో చూడాలి.

 

 

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!