నాగార్జున సాగర్ లో బీజేపీ సత్తా ఎంత..?

1 min read

వి.ఎస్.ఆర్. ఎడిటర్

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్ కు ఎదురుగాలి మొదలైంది. దుబ్బాకతో గులాబీ ర్టీకి అపజయాల వాసనలు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ లో కేసీఆర్ పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు అయింది. ఇక త్వరలో రాబోయే నాగార్జున సాగర్  ఉప ఎన్నిక కారు పార్టీ కి కంగారు తెప్పిస్తోంది. మరో వైపు కాంగ్రెస్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది. తెలంగాణ ఏర్పాటు నుంచి ఆ పార్టీని అపజయాలే పలుకరిస్తున్నాయి. 2018 సాధారణ ఎన్నికల్లో చితికిల పడిన కాంగ్రెస్  దుబ్బాక డిపాజిట్ పొగొట్టుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో మరో సారి ఘోర పరాభవాన్ని పొందింది. నాగార్జున సాగర్  ఉప ఎన్నికల్లోనైనా గెలిచి పార్టీని గాడిలో పెట్టాలని నాయకత్వం భావిస్తోంది. కొత్త పీసీసీ అధ్యక్షుడి సారథ్యంలో బై ఎలక్షన్ కాంగ్రెస్ సిద్ధమౌతోంది. 
          మరో వైపు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తిన్న భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల్లో పుంజుకుంది. నాలుగు ఎం.పి స్థానాలను గెలవడం ద్వారా తెలంగాణలో తన సత్తా చాటింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా విజయాలను నమోదు చేయలేదు. అయిదే దుబ్బాక లో అనూహ్యా ఫలితంగా తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆశ్యర్యపర్చింది. అదే ఊపులో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటింది. టీఆర్ఎస్ ను చిత్తు చేస్తు ఏకంగా 48 డివిజన్లలో కాషాయ అభ్యర్థులు విజయాలు సాధించారు. గ్రేటర్ లో అధికార పార్టీని దెబ్బతీసిన ఉత్సాహంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మీద ద్రుష్టి సారించింది. అక్కడ కూడా గెలవడం ద్వారా టీఆర్ఎస్ కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకోవాలని బీజేపీ ఊవ్విల్లూరుతోంది. అయితే నాగార్జున సాగర్ లో బీజేపీకి అంత సీన్ ఉందా అన్న దానిపైన ఇఫ్పుడు చర్చ మొదలైంది. 
నాగార్జున సాగర్ నిజానికి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన రాజకీయ జీవితంలో ఆయన మూడు సార్లు మాత్రమే ఓటమి పాలయ్యారు. మొదటి సారి జనతా పార్టీ నుంచి పోటీ చేసి పరాజయం పాలైన ఆయన ఆ తర్వాత 1994లో తెలుగుదేశం అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తాజాగా 2018 లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహాయ్య  ఆయనను 7700 ఓట్ల మెజార్టీ తో చిత్తు చేశారు. మొత్తంగా నాగార్జున సాగర్ లో ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్, టీఆర్ఎస్ మాత్రమే. గతంలో ఇక్కడ టీడీపీ బలంగా ఉండేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ పార్టీ మొత్తం టీఆర్ఎస్ లో వెళ్లిపోయంది. ఇక బీజేపీ విషయానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ దక్కలేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కంకణాల నివేదిత కు 2,675 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే 1.48 శాతం ఓట్లు మాత్రమే. నిజానికి నాగార్జున సాగర్ లో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు. నియోజకవర్గం అంతా గ్రామీణ ప్రాంతాలే ఉండటంతో ఆ పార్టీకి ఎక్కడా పట్టులేదు. మొదటి నుంచి కొద్ది మంది కార్యకర్తలే బీజేపీలో కొనసాగుతూ వస్తున్నారు. 
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభావం పైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది.అయితే దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ మాదిరిగా ఇక్కడ కాషాయ పార్టీకి పట్టుచిక్కే సూచనలు కనపడటం లేదు. ఆ స్థాయిలో ఊపు రావడం సాగర్ లో కష్టమనే చెప్పాలి. బీజేపీకి దుబ్బాకలో అభ్యర్థి రఘనందన్ రావు ప్లస్ పాయింట్. గ్రేటర్ హైదరాబాద్ లో ఆ పార్టీకి సంస్థాగత బలం ఉంది. అందుకే బీజేపీ అక్కడ మంచి పోరాటం చేయగల్గింది. సాగర్ లో ఆ పరిస్థితి లేదు. అనుహ్యామైన గాలి వీస్తే తప్ప ఇక్కడ ఆ పార్టీ  గట్టి పోటీనిచ్చే అవకాశం లేదు. అధికార టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య కుమారుడు పోటీ చేసే సూచనలున్నాయి. మరో వైపు కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి లేదా ఆయన కుమారుడు రఘవీర్ రెడ్డి బరిలో ఉంటారు. ప్రధానంగా పోటీ వీరి మధ్యే ఉండనున్నది. బీజేపీ నుంచి కంకణాల నివేదితను మరో సారి పోటీ చేయవచ్చు. ఆమె భర్త కంకణాల శ్రీధర్ రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం కావడం, ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఊపు మీద ఉండటం వీరికి కలిసే వచ్చే అంశం. మరో వైపు జిల్లాలో ఎవరైనా ఓక ప్రముఖ నాయకుడిని పార్టీలో చేర్చుకొని బరిలో దింపే అంశాన్ని కూడా బీజేపీ పరిశీలించవచ్చు. ఇప్పటికే ఈ అన్వేషణ ప్రారంభమైనట్లు సమాచారం. మొత్తానికి నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను పక్కనెట్టి బీజేపీ ఏదైనా మిరాకిల్ చేస్తే అది కచ్చితంగా ప్రపంచంలో ఎనిమిదో వింతే కావొచ్చు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn